Trump: గ్రాడ్యుయేట్‌ అయితే నేరుగా గ్రీన్‌ కార్డు.. ట్రంప్‌ అనూహ్య ప్రతిపాదన!

Trump: తన వైఖరికి భిన్నంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలస విధానంపై అనూహ్య ప్రతిపాదన చేశారు. కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్‌ అయిన వెంటనే గ్రీన్ కార్డు ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

Updated : 21 Jun 2024 17:14 IST

మియామీ: అమెరికా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్‌ అయిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్‌కార్డు ఇవ్వాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) ప్రతిపాదించారు. కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడంపై మీ ప్రణాళికలేంటని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో వలస విధానంపై తరచూ విరుచుకుపడే ఆయన నోటినుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ కాగానే ఈ దేశంలో ఉండేందుకు వీలుగా డిప్లొమాతో పాటే నేరుగా గ్రీన్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అది రెండేళ్లు.. నాలుగేళ్లు.. ఇలా విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేదు. జూనియర్‌ కాలేజ్‌లకు కూడా దీన్ని వర్తింపజేయాలని భావిస్తున్నాను’’ అని ట్రంప్‌ (Donald Trump) అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తొలిరోజే దీనిపై దృష్టి సారిస్తానని వెల్లడించారు. కరోనా వైరస్‌ కారణంగానే గతంలో దీన్ని అమలు చేయలేకపోయానని సమర్థించుకున్నారు. వీసా సమస్యల కారణంగా భారత్‌, చైనా వంటి దేశాల నుంచి వస్తున్న చాలామంది అమెరికాలో ఉండలేకపోతున్నారని తెలిపారు. వారంతా సొంత దేశాలకు వెళ్లి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

గల్వాన్‌ తరహా దాడికి పాల్పడిన చైనా

రెండోసారి అధ్యక్ష పీఠం కోసం బరిలోకి దిగనున్న ట్రంప్‌ (Trump).. సాధారణంగా ప్రచార కార్యక్రమాల్లో విదేశీ వలస విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అక్రమ వలసదారులు దేశంలో నిరుద్యోగం, హింస, నేరాలు, వనరుల దోపిడీకి కారణమవుతున్నారని పలు సందర్భాల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వస్తే వారందరినీ తిప్పి పంపిస్తానని హామీ ఇచ్చారు.

అక్రమంగా వలస వచ్చేవారిపైనే తమ దృష్టి ఉంటుందని ట్రంప్‌ (Trump) ప్రచార బృందం పలుమార్లు వివరణ ఇచ్చింది. కానీ, ఆయన అధికారంలో ఉన్నప్పుడు చట్టబద్ధ వలసదారులపైనా ఆంక్షలు విధించారు. కుటుంబ ఆధారిత వీసాలు, వీసా లాటరీ విధానంలో మార్పులు చేశారు. 2017లో అధికారం చేపట్టిన వెంటనే ‘బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌ (Buy American.. Hire American)’ పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. అత్యంత నైపుణ్యం గల వారికి మాత్రమే బిజినెస్‌ వీసాలు జారీ చేసేలా సంస్కరణలు చేపట్టాలని అప్పటి క్యాబినెట్‌కు సూచించారు. తద్వారా అమెరికన్ల ఉపాధి అవకాశాలను రక్షించాలని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని