Donald Trump: ట్రంప్‌ నోట అదేమాట.. పుతిన్‌ ఈజ్‌ స్మార్ట్‌..!

అమెరికా మాజీ అధ్యక్షుడు మాత్రం రష్యా అధినేతను పొగడ్తలతో ముంచెత్తుతూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ బహిరంగ సమావేశంలో పుతిన్‌ తెలివైనవాడంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రశంసించారు.

Published : 27 Feb 2022 16:27 IST

దేశాధినేతలే మూగవారన్న అమెరికా మాజీ అధ్యక్షుడు

వాషింగ్టన్‌: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తోన్న రష్యాపై ప్రపంచాధినేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతిచర్యగా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నారు. అయినప్పటికీ అమెరికా మాజీ అధ్యక్షుడు మాత్రం రష్యా అధినేతను పొగడ్తలతో ముంచెత్తుతూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ బహిరంగ సమావేశంలో పుతిన్‌ తెలివైనవాడంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రశంసించారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ సంక్షోభం వేళ నాటో దేశాధినేతలు మాత్రం మూగవారిగా ఉండిపోయారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్‌పై భీకర దాడులు ప్రారంభమైన సమయంలోనూ అమెరికా మాజీ అధ్యక్షుడు రష్యా అధినేతను ప్రశంసించడం గమనార్హం.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా కన్జర్వేటివ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కాన్ఫరెన్స్‌ (CPAC) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్‌ తెలివైనవాడని భావిస్తున్నారా..? అంటూ అంతకుముందు విలేకరులు అడిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశాడు.. ‘అవును. పుతిన్‌ తెలివైన వాడు. నాటో దేశాలతోపాటు ప్రపంచ దేశాల ప్రతిస్పందన, బెదిరింపులు, వ్యూహాలను పరిశీలించినప్పుడు వారు తెలివిగా వ్యవహరించినట్లు కనిపించడం లేదు. తెలివైన తీరుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు’ అంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

బైడెన్‌ను వాయిస్తోన్న పుతిన్‌..

అయితే, ఉక్రెయిన్‌పై జరుగుతోన్న దాడిని మాత్రం మానవత్వంపై దాడిగా అభివర్ణించిన డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇలాంటివి ఎన్నడూ జరగనీయకూడదని అన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ ప్రజల తరపున ప్రార్థిస్తామని చెప్పిన ట్రంప్‌.. పుతిన్‌ తెలివైనవాడా..?కాదా అనేది అసలు సమస్య కాదన్నారు. నాటో దేశాధినేతలు నోరుతెరవకుండా, మూగవారిగా ఉండిపోవడమే అసలు సమస్య అంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ ఉద్ఘాటించారు. ఈ విషయంలో అధినేతలు చెబుతున్న ఆర్థిక ఆంక్షలు చాలా బలహీనమైనవన్నారు. ముఖ్యంగా జో బైడెన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఓ డ్రమ్‌ మాదిరిగా వాయిస్తున్నాడని విమర్శించారు. అమెరికా చరిత్రలో ఐదుగురు అత్యంత బలహీన అధ్యక్షులను చూస్తే.. వారందరూ కలిసి చేసిన నష్టాలకంటే ఈ స్వల్ప కాలంలో బైడెన్‌ చేసిన నష్టాలే ఎక్కువే ఉండొచ్చని ఆరోపించారు.

ఇక ఉక్రెయిన్‌ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యవహరిస్తోన్న తీరును అత్యంత తెలివైన నిర్ణయంగా ట్రంప్‌ ఇటీవల అభివర్ణించారు. ఈ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిస్పందనపైనా మండిపడ్డారు. మరోవైపు అమెరికా, పశ్చిమ దేశాలు మాత్రం రష్యాపై చర్యలకు ఉపక్రమిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్స్‌ (SWIFT) నుంచి రష్యా బ్యాంకులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని