Donald Trump: ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే.. దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ చేపడతానని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు.

Published : 17 Jun 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే.. దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ చేపడతానని డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పేర్కొన్నారు. తనకు ఓటు వేస్తే.. రాడికల్‌ ఇస్లామిక్‌ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతానని మిషిగాన్‌లో నిర్వహించిన ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఐసిస్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని అమెరికా అధికారులు శనివారం అరెస్టు చేసిన వేళ ట్రంప్‌ ఈమేరకు మాట్లాడారు.

‘‘మన దేశం ఇప్పుడు పడినంత ప్రమాదంలో ఎప్పుడూ లేదు. వేలాది మంది ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారు. దీనికి అనేక ఏళ్లపాటు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో.. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఓటరు ఛాయిస్‌ సుస్పష్టం. వేలాదిమంది రాడికల్‌ ఇస్లామిక్‌ ఉగ్రవాదులను దేశంలోకి అనుమతించే అధ్యక్షుడు కావాలా? లేదా అటువంటి వారిని దేశం నుంచి బయటకు పంపించే అధ్యక్షుడు కావాలా? అనేది నిర్ణయించుకోండి’’ అని ట్రంప్‌ తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజు నుంచే దేశ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ను మొదలుపెడతానన్నారు. ఇలా చేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు.

అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్‌

అగ్రరాజ్యంలోకి వలసలు పోటెత్తుతున్నాయంటూ రిపబ్లికన్లు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వలసదారులు అమెరికాకు రావడాన్ని డెమోక్రటిక్ నేత, దేశాధ్యక్షుడు జో బైడెన్ సులభతరం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక సందర్భాల్లో ట్రంప్ తన వలసల వ్యతిరేక విధానాలను ఓటర్ల ముందు ఉంచారు. వలసదారులను పూర్తిగా తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని