Earthquake: సముద్ర గర్భంలో భారీ భూకంపం.. పలు దేశాలకు సునామీ హెచ్చరికలు

పసిఫిక్‌ సముద్రంలో సంభవించిన భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని ఫలితంగా వనౌతు,ఫిజీ, న్యూ కలెడోనియా ద్వీపదేశాలకు సునామీ పొంచి ఉందని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది.

Published : 19 May 2023 19:35 IST

వాషింగ్టన్‌: పసిఫిక్‌ మహాసముద్రం ఆగ్నేయప్రాంతంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ పరిణామంతో సమీపంలోని ద్వీపదేశాలైన వనౌతు (Vanuatu), ఫిజీ (Fiji), న్యూకలెడోనియా (New Caledonia) దేశాలకు సునామీ (Tsunami) ముప్పు పొంచి ఉందని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది. స్థానికులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. యునైటెడ్ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే(యూఎస్‌జీఎస్‌) వెల్లడించిన వివరాల ప్రకారం.. సముద్ర ఉపరితలానికి 38 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీని ఫలితంగా భారీ ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉంది.

పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తతతో న్యూ కలెడోనియా అధికారులు దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. తీరప్రాంతాలను ఖాళీ చేసి.. వీలైనంత త్వరగా ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లిపోవాలని అక్కడి ప్రజలను కోరారు. ఎలాంటి విపత్తు సంభవించినా సమర్థంగా ఎదుర్కొనేందుకు పౌర భద్రత, ప్రమాద నిర్వహణ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా సమీపంలోని లాయల్టీ దీవులకు కూడా ప్రమాద తీవ్రతను గురించి సమాచారం అందించారు.

మరోవైపు వనౌతు దేశం కూడా అక్కడి పౌరులను అప్రమత్తం చేసింది. ఎత్తయిన కెరటాలు ఎగసి పడొచ్చని తీర ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతాల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జాతీయ విపత్తు నిర్వహణ కార్యాలయం ఆదేశించింది. వీలైనంత త్వరగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రదేశాలకు తరలించాలని సూచించింది. అధికారులకు ప్రజలు సహకరించాలని, ఎప్పటికప్పుడు వాతావరణ విషయాలను తెలుసుకోవాలని కోరింది.

ప్రమాద తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్న ఫిజీ దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వచ్చిపడుతుందోనని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు అధికారులు కూడా పరిస్థితులను లోతుగా పరిశీలిస్తున్నారు. నిర్వాసితులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరంగా తీర ప్రాంతాలను వీడాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరారు. ఒక వేళ సునామీ వస్తే సమీపంలోని న్యూజిల్యాండ్‌ తదితర దేశాలపైనా ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కూడా అమ్రమత్తతో వ్యవహరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని