Turkey: టర్కీ అదుపులో రష్యా ధాన్యం రవాణా నౌక

రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం తరలిస్తున్న రష్యా నౌక ఝిబెక్‌ ఝోలెను టర్కీ కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.

Published : 05 Jul 2022 01:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం తరలిస్తున్న రష్యా నౌక ఝిబెక్‌ ఝోలెను టర్కీ కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ దౌత్యవేత్త వాస్యల్‌ బోడ్నార్‌ వెల్లడించారు. ‘‘ప్రస్తుతం ఆ నౌక పోర్టు సమీపంలో ఉంది. దానిని టర్కీ కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ పోర్టు బెర్డియాన్స్క్‌ నుంచి వచ్చే సమయంలో రష్యా నౌక కదలికలను పూర్తిగా కనిపెట్టినట్లు చెప్పారు. ఈ నౌకలోకి కార్గో ఎలా వచ్చిందో తెలియడం లేదన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌ ధాన్యం దొంగిలిస్తున్నట్లు రష్యాపై ఆరోపణలున్న విషయం తెలిసిందే.

పోర్టు బెర్డియాన్స్క్‌ ఉక్రెయిన్‌ దక్షిణాన జపోర్జియా ప్రాంతంలోని అజోవ్‌ సముద్రంలో ఉంది. ఈ నౌక బయల్దేరిందన్న విషయాన్ని జపోర్జియా గవర్నర్‌ యవ్‌హన్‌ టెలిగ్రామ్‌ యాప్‌లో ప్రకటించారు. ఆయన్ను ఇటీవలే రష్యా నియమించింది. ఈ నౌకలో 7,000 టన్నుల ధాన్యాలను మిత్రదేశాలకు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ నౌకకు రష్యా బ్లాక్‌ సీ దళంలోని నౌకలు రక్షణనిస్తాయని పేర్కొన్నారు.  ఈ నౌక జూన్‌ 22వ తేదీన టర్కీ రేవు నుంచి బయల్దేరి రష్యాలోని ఓ పోర్టులో అన్‌లోడ్‌ చేసింది. అనంతరం ఉక్రెయిన్‌కు బయల్దేరి వెళ్లింది. ఆసమయంలో ట్రాకింగ్‌ సిగ్నల్‌ను ఆపివేసింది. ఆ తర్వాత జూన్‌ 29న మాత్రమే సిగ్నల్‌ మళ్లీ కనిపించడం మొదలైంది. ఆ సమయంలో ఇది ఉక్రెయిన్‌ తీరం నుంచి బయల్దేరింది. దీని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని