Turkey: మృత్యువును గెలిచిన ఈ పసిపాప గుర్తుందా..? ఎట్టకేలకు తల్లి చెంతకు

తుర్కియేలో భూకంప శిథిలాల్లో చిక్కుకుని.. 128 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన చిన్నారి గుర్తుందా..! ఎట్టకేలకు ఆ పసిపాపను ఆమె తల్లి చెంతకు చేర్చారు.

Published : 03 Apr 2023 17:55 IST

అంకారా: దాదాపు రెండు నెలల క్రితం సంభవించిన భారీ భూకంపం (Earthquake) ధాటికి తుర్కియే (Turkey), సిరియా (Syria)లు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విలయానికి ఇరు దేశాల్లో దాదాపు 57వేలకు పైగా మృతి చెందారు. ఒక్క తుర్కియేలోనే 50 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల క్రమంలో భూకంపం ధాటికి నేలకూలిన భవనాల శిథిలాలనుంచి అనేక మందిని ప్రాణాలతో వెలికితీశారు. తుర్కియేలోని హతాయ్‌లో ఓ రెండు నెలల పసిపాప.. ఏకంగా 128 గంటల తర్వాత మృత్యుంజయురాలిగా బయటపడి, యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ముద్దులొలికే ఆ చిన్నారి ఫొటో అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, పాప తల్లి ఈ ఘటనలో మృతి చెందినట్లు అంతా భావించారు. కానీ, ఆమె బతికే ఉన్నట్లు ఇటీవల తెలిసింది.

దీంతో తాజాగా శిశువును తల్లి చెంతకు చేర్చారు. ఉక్రెయిన్‌ మంత్రి ఆంటన్ గెరాషెంకో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘తుర్కియేలో భూకంప శిథిలాల కింద 128 గంటలపాటు ప్రాణాలతో నిలదొక్కుకున్న పాప బహుశా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆమె తల్లి మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఆమె బతికే ఉన్నారు. వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 54 రోజుల తర్వాత.. డీఎన్‌ఏ పరీక్ష అనంతరం బిడ్డను తల్లి చెంతకు చేర్చారు’ అని గెరాషెంకో ట్వీట్‌ చేశారు. అంతకుముందు తుర్కియే కుటుంబ, సామాజిక సేవల శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ఇదొక అద్భుతమంటూ అభివర్ణించారు. ప్రపంచంలో ఎంతో అద్భుతం ఏంటంటే.. తల్లి, బిడ్డను కలపడమేనని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని