Turkey Earthquake: ఆ ప్రాంతాల్లో మూడు నెలల అత్యవసర స్థితి.. ప్రకటించిన ఎర్డోగన్‌

తుర్కియే(Turkey)లోని భూకంప ప్రభావిత 10 ప్రావిన్సుల్లో మూడునెలలపాటు అత్యవసర స్థితి విధిస్తున్నట్లు దేశాధ్యక్షుడు ఎర్డోగన్‌ ప్రకటించారు. సహాయక చర్యలకు 50 వేల మంది సిబ్బందిని పంపుతున్నట్లు తెలిపారు.

Published : 07 Feb 2023 23:21 IST

అంకారా: తీవ్ర భూకంపం(Earthquake)తో తుర్కియే(Turkey) అతాలకుతలమైంది. ఎక్కడికక్కడ శిథిలాలతో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. స్థానికంగా ఇప్పటికే మూడు వేలకుపైగా ప్రజలు మృతి చెందారు. మరోవైపు.. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగ్నేయ తుర్కియేలోని భూకంప ప్రభావిత 10 ప్రావిన్సుల్లో మూడు నెలలపాటు అత్యవసర స్థితి (State Of Emergency) విధిస్తున్నట్లు దేశాధ్యక్షుడు ఎర్డోగన్‌(Erdogan) మంగళవారం ప్రకటించారు. సహాయక చర్యలు  (Rescue and Recovery)  సాఫీగా, వేగంగా సాగేలా నిర్ధారించేందుకు అత్యవసర స్థితిని ప్రకటించినట్లు ఆయన తెలిపారు.

విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యల నిర్వహణకు 50 వేలమందికి పైగా సిబ్బందిని పంపుతున్నట్లు ఎర్డోగన్‌ వెల్లడించారు. ఈ క్రమంలోనే 100 బిలియన్‌ లిరాలు (5.3 బిలియన్‌ డాలర్ల) ఆర్థిక సాయం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. తుర్కియేలో సిరియా సరిహద్దు సమీపంలోని ప్రాంతాల్లో శీతాకాలపు మంచుతుపాను కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. అయితే.. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు అత్యవసర చర్యలు తీసుకుంటున్నట్లు ఎర్డోగన్ తెలిపారు. భూకంప సహాయక చర్యల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోందంటూ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న వేళ.. ఎర్డోగన్ ఈ మేరకు చర్యలు చేపట్టారు. మేలో పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రకృతి వైపరీత్య నిర్వహణ ఆయనకు సవాల్‌గా మారింది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు