Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు

భూకంపం (Turkey Earthquake) ప్రభావంతో శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. మరోవైపు తుర్కియే, సిరియా దేశాల్లో హృదయాలను ద్రవింపజేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

Published : 08 Feb 2023 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారీ భూకంపం ధాటికి కకావికలమైన సిరియాలో అద్భుతం చోటు చేసుకుంది. భవనాల శిథిలాల కింద కొన్ని గంటలపాటు చిక్కుకున్న చిన్నారులను సహాయక సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. ఒకే పట్టణంలోని రెండు వేర్వేరు భవనాల శిథిలాల నుంచి మృత్యుంజయులుగా బయటకు వచ్చిన ఆ చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు ఆనందం  వ్యక్తంచేశారు.

భారీ భూకంపానికి ఉక్కిరి బిక్కిరైన తుర్కియే, సిరియా దేశాల్లో హృదయాలను ద్రవింపజేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. శిథిలాలకింద చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనాలు పేకమేడల్లా కూలిపోగా.. ఆ శిథిలాల్లో అణువణువునా గాలిస్తున్నారు. వాయవ్య సిరియాలోని జిందెరిస్‌ పట్టణంలో ఓ భవనం శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు.

నూర్‌ అనే చిన్నారి ఆచూకీ కోసం ఆమె తండ్రి భవన శిథిలాల కింద గాలించారు. రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు.. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నూర్‌ జాడ కనిపెట్టిన సిబ్బంది.. ఆ చిన్నారికి ధైర్యం కల్పించారు. తన తండ్రి అక్కడే ఉన్నాడని, అతనితో మాట్లాడాలని సూచించారు. ఆ తర్వాత శిథిలాల నుంచి చిన్నారిని సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. దీంతో నూర్‌ కుటుంబ సభ్యులతోపాటు సహాయక సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సహాయక సిబ్బంది విడుదల చేశారు.అదే  జిందెరిస్‌ పట్టణంలో హరుణ్‌ అనే బాలుడుని రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో బయటకు తీశారు. శిథిలాల్లో ప్రాణభయంతో ఉన్న హరుణ్‌ను కాపాడారు. ‘హరుణ్‌..నువ్వు ఒక హీరోవి.. బయటకు రా’ అంటూ ప్రోత్సహించారు. రాత్రి వేళ చిమ్మచీకటిలో బిక్కుబిక్కుమంటూ.. బతుకుతున్న హరుణ్‌ను సురక్షితంగా బయటకు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని