Earthquake: భూ ప్రళయం.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరిగిన మృతులు

తుర్కియే (Turkey), సిరియా (Syria)లో భూకంపం (Earthquake) సృష్టించిన ఘోర విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భవన శిథిలాల కింద నిత్యం వందలాది శవాలు బయటపడుతుండటం కలచివేస్తోంది.

Updated : 09 Feb 2023 21:12 IST

అంకారా: ప్రకృతి సృష్టించిన ఘోర విపత్తుతో కకావికలమైన తుర్కియే (Turkey), సిరియా (Syria)లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఎటు చూసినా శిథిలాల గుట్టలు.. శవాల దిబ్బలే కన్పిస్తున్నాయి. నిమిష నిమిషానికి వందలాది మృతదేహాలు బయట పడుతుండటంతో అక్కడి నెలకొన్న పరిస్థితులు హృదయాలను మెలిపెడుతున్నాయి. ఈ భూ ప్రళయం కారణంగా ఇరు దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు 20వేలకు చేరువలో ఉంది.  తుర్కియేలో ఇప్పటివరకు 16,100 మందికి పైగా మృతిచెందగా.. 64వేల మంది గాయపడినట్టు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ వెల్లడించారు. అలాగే, సిరియాలో ఇప్పటివరకు 3,100 మంది మృతిచెందగా.. 5వేల మందికి పైగా గాయపడి చికిత్సపొందుతున్నట్టు సమాచారం.

తుర్కియేలో ఇప్పటివరకు 16,100 మంది ఈ ప్రకృతి ప్రకోపానికి బలైపోగా. 64వేల మంది గాయపడినట్టు దేశాధ్యక్షుడు ఎర్డోగాన్‌ వెల్లడించారు. గురువారం ఆయన గాంజియాతెప్‌ ప్రాంతంలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇక, పొరుగున ఉన్న సిరియాలో మరో 3,100 మందికి పైగా మృతిచెందారు. దీంతో ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 19,200కు పైగా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద ఇంకా లక్షలాది మంది చిక్కుకుపోయారు. వారి సంఖ్య కచ్చితంగా తెలియనప్పటికీ.. పరిస్థితి మాత్రం అత్యంత విషమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక బలగాలు కాలంతో పోటీపడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ.. వరుసగా వస్తున్న ప్రకంపనలు, వాతావరణ పరిస్థితులు ఆటంకం కలిగిస్తున్నాయి.

1117 సార్లు కంపించిన భూమి..

గత సోమవారం 7.8తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత నుంచి అనేక సార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తుర్కియేలో ఇప్పటివరకు 1117 సార్లు భూమి కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరుస ప్రకంపనలతో బలహీనంగా ఉన్న భవనాలు కూలిపోతున్నాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరగడంతో పాటు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు.

అవును.. లోపాలున్నాయి: ఎర్డోగాన్‌

సోమవారం నాటి భూకంపం ధాటికి ఎక్కువగా నష్టపోయింది తుర్కియేనే. దాదాపు 10 ప్రావిన్స్‌లు ఇప్పుడు నామరూపాల్లేకుండా మారిపోయాయి. ఒక్కో భవన శిథిలాల కింద 400-500 మంది చిక్కుకుపోగా.. వారిని కాపాడేందుకు కనీసం 10 మంది సహాయక సిబ్బంది కూడా అందుబాటులో లేరు. శిథిలాలను తొలగించడానికి సరైన యంత్రాలు కూడా లేకపోవడంతో తుర్కియే అధ్యక్షుడు రెసెస్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ (Recep Tayyip Erdogan) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఆయన భూకంప బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో లోపాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే ఈ ఘోర విపత్తును ముందే ఊహించిన సిద్ధపడటం సాధ్యం కాదన్నారు. ‘‘అవును. కొన్ని లోపాలున్నాయి. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో మనందరికీ కన్పిస్తూనే ఉంది. ఇలాంటి విపత్తుకు సిద్ధంగా ఉండటం అనేది ఎవరికీ సాధ్యం కాదు’’ అని తెలిపారు.

తుర్కియేలోని అంటాక్య నగరంలో భూకంపానికి ముందు.. తర్వాత (శాటిలైట్‌ చిత్రాలు)

ట్విటర్‌పై ఆంక్షలు..

మరోవైపు తుర్కియే ప్రభుత్వంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో రాజధాని అంకారా సహా పలు నగరాల్లో ట్విటర్‌ (Twitter)పై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. తుర్కిష్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ల్లో ట్విటర్‌ పనిచేయడం లేదని నెట్‌బ్లాక్స్‌ అనే వెబ్‌ మానిటరింగ్‌ సంస్థ వెల్లడించింది. అసత్య ప్రచార వ్యాప్తిని అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పిల్లల దుస్తులను కాల్చుతూ..

భూకంపం ధాటికి సర్వం కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గడ్డకట్టే చలిలో వారంతా ఇప్పుడు తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చలిని తట్టుకునేందుకు వెచ్చదనం కోసం పార్కుల్లోని బెంచీలు, పిల్లల దుస్తులను కాల్చేస్తున్నారు. ఇలాంటి హృదయ విదారక దృశ్యాలెన్నో కన్పిస్తున్నాయి. ఈ విషాదానికి అంతమెక్కడో తెలియక తుర్కియే వాసులు క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు