Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!

తీవ్ర భూకంపం (Earthquake) ధాటికి తుర్కియే, సిరియా ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, ఇంతటి భారీ భూకంప తీవ్రతను పరిశోధకులు ముందుగానే అంచనా వేసిన విషయం బయటకు వచ్చింది. అయినప్పటికీ వాటిని తేలికగా తీసుకోవడంతో నష్ట తీవ్రత అధికంగా ఉందనే వాదన మొదలయ్యింది.

Published : 07 Feb 2023 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ భూకంపంతో (Earthquake) తుర్కియే, సిరియాల్లో కనీవినీ ఎరుగని ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. అయితే, ఇంతటి విపత్తును ముందే అంచనా వేయలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ.. దక్షిణ మధ్య తుర్కియే (Turkey), జొర్డాన్‌, సిరియా (Syria), లెబనాన్‌లలో భారీ భూకంపం సంభవించవచ్చని మూడు రోజుల ముందే నిపుణులు హెచ్చరించినట్లు తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే సోలార్‌ సిస్టమ్‌ జియోమెట్రీ సర్వే(SSGEOS) సంస్థకు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్‌ హూగర్‌బీట్స్‌.. తాజా విపత్తును ముందే అంచనా వేశారు. ‘త్వరలోనే దక్షిణ మధ్య తుర్కియే, జొర్డాన్‌, సిరియా, లెబనాన్‌ ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉంది’ అని ఫిబ్రవరి 3నే ఓ ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన అంచనాలు నిజమయ్యాయి. ఫిబ్రవరి 6న తెల్లవారుజామున మొదలైన భూకంప ప్రకంపనలు విలయాన్ని సృష్టించాయి.

తాజాగా దీనిపై స్పందించిన ఫ్రాంక్‌ హూగర్‌బీట్స్‌.. ఈ సంఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. త్వరలోనే భూకంపం వస్తున్నట్లు ముందుగానే చెప్పానని.. అది 115 ఏళ్ల క్రితం వచ్చిన మాదిరిగానే ఉంటుందని అన్నారు. గ్రహ సంబంధిత సంక్లిష్ట రేఖాగణితం ఆధారంగా వీటిని ముందుగానే అంచనా వేశామన్నారు. స్థానికంగా ఇప్పటివరకు సంభవించిన దాంట్లో ఇదే అత్యంత తీవ్రమైనదని.. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈయన చెప్పినట్లుగానే గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు వచ్చాయి.

అయితే, ఫ్రాంక్‌ హూగర్‌బీట్స్‌ ముందస్తుగా చేసిన హెచ్చరికలపై పలు విమర్శలు కూడా వచ్చాయి. భూకంపాలను అంచనా వేసేందుకు కచ్చితమైన విధానమేదీ ప్రస్తుతం అందుబాటులో లేదంటూ కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. గతంలో ఆయన చేసిన అంచనాలు తప్పాయని వెల్లడించారు. కానీ, ప్రస్తుతం ఫ్రాంక్‌ అంచనాలు నిజం కావడంతో లక్షల సంఖ్యలో నెటిజన్లు ఆయన ట్వీట్లు చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు