Earthquake: 6వేల ప్రకంపనలు.. 46వేల మరణాలు.. లక్షకుపైగా భవనాలు ధ్వంసం..!

తుర్కియే (Turkey), సిరియాలో సంభవించిన భూకంపంతో (Earthquake) మరణించిన వారి సంఖ్య 46వేలు దాటింది. ఇప్పటికే రెండు వారాలు కావడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి బతికే అవకాశం తక్కువగా ఉందని తుర్కియే ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌ను ముగిస్తున్నామని తెలిపింది.

Published : 20 Feb 2023 01:33 IST

అంకారా: తీవ్ర భూకంపంతో తుర్కియే (Turkey), సిరియా (Syria)లు అల్లాడిపోయిన విషయం తెలిసిందే. ఈ విపత్తు సంభవించి దాదాపు రెండు వారాలు అయ్యింది . ఇప్పటికే రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 46 వేలు దాటింది. ఒక్క తుర్కియేలోనే 40 వేలకు పైగా మృతి చెందారు. సిరియాలో 5800కుపైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19రోజున సహాయక చర్యలను ముగిస్తామని తుర్కియే డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (AFAD) ప్రకటించింది. భూకంపం (Earthquake) సంభవించి ఇప్పటికే 296 గంటలు దాటడంతో.. శిథిలాల్లో చిక్కుకుపోయినవారు ప్రాణాలతో మిగిలే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపింది.

6వేల ప్రకంపనలు..

ఫిబ్రవరి 6వ తేదీన భూకంపం సంభవించిన తర్వాత కూడా 11 ప్రావిన్సుల్లో వేల తదనంతర ప్రకంపనలు (Aftershocks) వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 6040 ప్రకంపనలు సంభవించినట్లు ఏఎఫ్‌ఏడీ వెల్లడించింది. ఇందులో 5 నుంచి 6 తీవ్రత మధ్య ఉన్నవి సుమారు 40వరకూ ఉన్నాయని.. కేవలం ఒక్కసారి మాత్రమే 6.6 తీవ్రతతో భూమి కంపించిందని పేర్కొంది. ఈ తరుణంలో కొండచరియలు, రాళ్లుపడిపోవడం వంటి తక్కువ మోతాదు విపత్తు ముప్పు పొంచి ఉందని ఏఎఫ్‌ఏడీ హెచ్చరించింది.

లక్షకుపైగా భవనాలు ధ్వంసం..

భూకంప తీవ్రతతో ప్రభావితమైన భవనాలను పరిశీలించగా.. అందులో 1,05,794 భవనాలు కూలిపోవడం లేదా తీవ్రంగా దెబ్బతినడం వల్ల కూల్చేసే పరిస్థితి తలెత్తిందని తుర్కియే పర్యావరణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే 20,662 భవనాలు పూర్తిగా కూలిపోయినట్లు తెలిపింది. వీటిలో మొత్తం 3,84,500 నివాసాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, ఇవి కేవలం తుర్కియేకు సంబంధించినవి మాత్రమేనని.. సిరియాలోనూ భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుందని వెల్లడించింది.

అంటువ్యాధుల భయం..

భూకంపం ధాటికి తుర్కియేలో వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం కావడంతో అక్కడి పర్యావరణ పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో వ్యాధుల భయం నెలకొందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే స్థానికంగా అంటువ్యాధులు పెరిగినప్పటికీ, తీవ్రమైన ముప్పు మాత్రం లేదని తుర్కియే ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించే పరిస్థితులపై పోరాడటం, అంటువ్యాధులను నివారించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని తెలిపింది.

ముగిసిన ‘ఆపరేషన్‌ దోస్త్‌’..

తుర్కియేలో సహాయక చర్యలకుగానూ భారత్‌ నిర్వహించిన ‘ఆపరేషన్‌ దోస్త్‌’ (Operation Dost) ముగిసింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) చివరి బృందం స్వదేశానికి చేరుకుంది. విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఈ విషయాన్ని వెల్లడించారు. మూడు బృందాల్లో మొత్తం 151 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, డాగ్‌స్క్వాడ్‌లు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. నుర్‌దాగీ, అంటక్యాలోని 35 ప్రాంతాల్లో మన సిబ్బంది సహాయక చర్యలు నిర్వహించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని