Taiwan: ఇద్దరు చైనా మత్స్యకారులు మృతి.. తైవాన్‌తో భగ్గుమన్న విభేదాలు

తైవాన్‌ కోస్టుగార్డు వెంటపడటంతో తప్పించుకొనే యత్నంలో ఇద్దరు చైనా మత్స్యకారులు మరణించారు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 

Updated : 15 Feb 2024 18:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China)-తైవాన్‌ (Taiwan)ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇద్దరు మత్స్యకారులు మరణం దీనికి కారణమైంది. బుధవారం చైనాకు చెందిన ఓ చేపల వేటకు వెళ్లే పడవలో ఉన్న నలుగురు మత్స్యకారులతో కలిసి తమ జలాల్లో ప్రవేశించినట్లు తైవాన్‌ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది చెప్పారు. ఈ సమయంలో వారిని అడ్డుకొని తనిఖీ చేయాలని ప్రయత్నించగా.. వారు పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. దీంతో వారిని తైవాన్‌ సిబ్బంది వెంబడించగా, ఇద్దరు నీట మునిగారు. వీరిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చనిపోయినట్లు ప్రకటించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తైవాన్‌ వెల్లడించింది. వీరిని కిన్మెన్‌కు చేర్చినట్లు తెలిపింది.  

ఈ ఘటనను బీజింగ్‌ తీవ్రంగా ఖండించింది. తైవాన్‌ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజల మనసులను ఇది గాయపరిచిందని పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని చైనాకు చెందిన తైవాన్‌ అఫైర్స్ కార్యాలయం కోరింది. బాధితుల కుటుంబాలకు సాయం చేస్తామని ప్రకటించింది. తైవాన్‌లోని కొత్త ప్రభుత్వం తమ దేశ మత్స్యకారుల పడవలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి పలు కుంటిసాకులు వెతుకుతోందని మండిపడింది. ఇలాంటి చర్యలు ప్రమాదకరమని హెచ్చరించింది. తైవాన్‌ జలసంధికి ఇరువైపులా ఉన్న కమ్యూనికేషన్‌లు ఒకే కుటుంబంలోనివని అభివర్ణించారు. మత్స్యకారులు సాధారణంగా పనులు చేసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. 

ఈ నెలలో రష్యాకు రెండోషాక్‌.. మరో భారీ నౌకను ధ్వంసం చేసిన ఉక్రెయిన్‌ సముద్ర డ్రోన్‌..!

ఇరు దేశాలకు వివాదం ఉన్న కిన్మెన్‌ లైన్‌కు మూడు కిలోమీటర్లు ఆగ్నేయంగా ఈ ఘటన జరిగింది. కొన్నాళ్లుగా ఇక్కడ కిన్మెన్‌ ద్వీపానికి సమీపంలోని తైవాన్‌ జలాల్లోకి తరచూ డ్రాగన్‌కు చెందిన డ్రెడ్జింగ్‌ నౌకలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి ద్వీపాల్లో సుమారు 1.80లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. తైవాన్‌కు ఇవి 187 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని