Flights: 15 మైళ్ల దూరంలో రెండు విమానాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

గగనతలంలో రెండు విమానాలకు తృటిలో ప్రమాదం తప్పింది. రెండు రోజుల కిందట తుర్కియే మీదుగా ప్రయాణిస్తున్న

Published : 16 Jun 2022 00:25 IST

కొలంబో: గగనతలంలో రెండు విమానాలకు తృటిలో ప్రమాదం తప్పింది. తుర్కియే మీదుగా ప్రయాణిస్తున్న బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం.. లండన్- కొలంబో వెళ్తున్న శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ విమానం ఒకదానికొకటి అత్యంత సమీపంగా వచ్చాయి. అయితే ఫైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. విమానాన్ని సురక్షితంగా నడిపి ప్రమాదాన్ని తప్పించించడంతో శ్రీలంక తమ పైలట్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.  రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

మొత్తం 275 మంది ప్రయాణికులతో లండన్ నుంచి కొలంబోకు బయలుదేరిన విమానం (యూఎల్‌ 504) మార్గమధ్యలో తుర్కియే (టర్కీ) గగనతలంలోకి ప్రవేశించింది. సరిగ్గా అదే సమయంలో 250 మందికిపైగా ప్రయాణికులతో దుబాయికి వెళ్తున్న బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ విమానం కేవలం 15 మైళ్ల దూరంలో 35వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగం గుర్తించింది. దీంతో అంకారాలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి శ్రీలంక విమాన ఫైలట్లకు సమాచారం అందించారు. ఈ సమయంలో విమానం 33,000 అడుగుల ఎత్తులో ఎగురుతుండగా.. 35,000 అడుగులకు పెంచాలని అంకారా ఏటీసీ సూచించింది. అయితే, యూఎల్ 504 విమానంపైనే మరొక విమానం ఎగురుతుందని..  శ్రీలంక పైలట్లు గుర్తించి ఎత్తుకు వెళ్లేందుకు నిరాకరించారు. కొద్దిసేపటికే అత్యవసరంగా స్పందించిన ఏటీసీ.. అప్పటికే 35,000 అడుగుల ఎత్తులో మరో విమానం ఉందని శ్రీలంక విమానాన్ని వెళ్లొద్దని సూచించింది. ఒకవేళ అంకారా ఏటీసీ కోరినట్టు యూఎల్ 504 కెప్టెన్ ఎత్తుకు వెళ్లి ఉంటే బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానాన్ని గాల్లోనే ఢీకొని ఉండేది. దీంతో రెండు విమానాలకు పెను ప్రమాదం తప్పినట్లయింది. 

దీనిపై శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ స్పందిస్తూ.. కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది. సిబ్బందితో పాటు ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని పేర్కొంది. ఈ ఘటనపై నివేదిక సమర్పించామని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని