Ukraine Crisis: రైల్వేస్టేషన్‌పై మిసైల్‌ దాడులు.. 35మంది మృతి; 100మందికి గాయాలు!

ఉక్రెయిన్‌పై రష్యా సేనల భీకర దాడులు కొనసాగుతూనేన్నాయి. బాంబులు, క్షిపణులు, రాకెట్‌ దాడులతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. కీవ్‌ నుంచి పుతిన్‌......

Published : 08 Apr 2022 16:01 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా సేనల భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బాంబులు, క్షిపణులు, రాకెట్‌ దాడులతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. కీవ్‌ నుంచి పుతిన్‌ సేనలు నిష్క్రమించినప్పటికీ మిగతా చోట్ల విధ్వంసక చర్యలు కొనసాగిస్తూ ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి. తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్స్‌ ప్రాంతం క్రమటోర్స్క్‌ రైల్వే స్టేషన్‌పై జరిగిన రెండు మిసైల్‌ దాడుల్లో కనీసం 35 మంది మృతిచెందగా.. 100 మందికి పైగా గాయపడినట్టు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. ఈ దాడులతో ఆ ప్రాంతమంతా జనం హాహాకారాలు, ఆర్తనాదాలతో దద్దరిల్లింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతుండటంతో సురక్షిత ప్రాంతాలకు జనాన్ని తరలిస్తున్న సమయంలో ఈ స్టేషన్‌లో దాడులు జరగడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.

ఖార్కివ్‌లో 24గంటల్లో 48సార్లు కాల్పులు

మరోవైపు, ఖర్కివ్‌ ప్రాంతం రష్యా బలగాల కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. గత 24గంటల వ్యవధిలో 48సార్లు కాల్పులు చోటుచేసుకోగా.. 15మంది గాయపడినట్టు ఖర్కివ్‌ గవర్నర్‌ తెలిపారు. రష్యా బలగాలు ఖర్కివ్‌, డెర్హాచిలోని నివాస ప్రాంతాలపై దాడి చేసేందుకు ఫిరంగిలు, యుద్ధ ట్యాంకులు, బహుళ ప్రయోగ రాకెట్‌ వ్యవస్థను ఉపయోగించాయని పేర్కొన్నారు.

19వేల మంది రష్యా సైనికులు మృతి

రష్యా దూకుడును ఉక్రెయిన్‌ బలగాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. శత్రుసేనల్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైనప్పట్నుంచి 19వేల మందికి పైగా సైనికుల్ని చంపినట్టు ఉక్రెయిన్‌ రక్షణశాఖ ప్రకటించింది. 150 విమానాలు, 135 హెలికాప్టర్లు, 700 ట్యాంకులు, 1891 సాయుధ శకటాలతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని