US: అమ్మా.. అని దీనంగా కేకలేసినా..! కనికరించని పోలీసులు

29 ఏళ్ల వ్యక్తిని పోలీసులు దారుణంగా హింసించిన ఘటనపై అమెరికా(US)లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు తాజాగా విడుదలయ్యాయి.

Updated : 28 Jan 2023 14:16 IST

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా(US)లో పోలీసుల తీరు మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది. కొద్దిరోజుల క్రితం వారు ఓ యువకుడిపై హింసాత్మకంగా ప్రవర్తించడంతో అతడు మృతి చెందాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుటేజ్‌ను అధికారిక వర్గాలు విడుదల చేయగా.. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

మృతుడు పేరు టైర్ నికోల్స్‌(Tyre Nichols). ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ ఫెడ్‌ఎక్స్‌లో పనిచేసేవాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో ఈ నెలలో అతడిని పోలీసులు ఆపినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా వీడియోలను బట్టి.. మెంఫిస్‌ నగర పోలీసులు (Memphis police) ఎందుకు ఆపారో మాత్రం వెల్లడికాలేదు. తాను ఏ తప్పు చేయలేదని చెప్తున్నప్పటికీ.. పోలీసులు అతడిని వాహనంలో నుంచి నేలపైకి లాగారు. నికోల్స్‌ చేతులు విరగ్గొట్టమని ఒక పోలీసు ఆదేశించడం వినిపిస్తోంది. అతడు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రిక్‌ షాకిచ్చే వెపన్‌ ఉపయోగించారు. పోలీసులు ఎలాంటి కనికరం లేకుండా చాలాసేపు అతడిని కొట్టారు. అతడు బాధతో విలవిలలాడుతూ అమ్మా.. అమ్మా అంటూ కేకలు వేయడం ఆ వీడియోల్లో వినిపిస్తోంది. జనవరి ఏడున ఈ ఘటన జరగ్గా.. చికిత్స పొందుతూ నికోల్స్‌ 10వ తేదీన మృతి చెందాడు.

దీనిపై అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వీడియో ఫుటేజ్‌ తప్పక ప్రజల్ని ఆగ్రహానికి గురిచేస్తుంది’ అని ఆయన ప్రకటన విడుదల చేశారు.

మృతుడు, ఆ మెంఫిస్ నగర పోలీసులు(Memphis police) అంతా నల్లజాతీయులే. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వారిపై హత్యా నేరం కింద అభియోగాలు మోపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని