UAE: రేప్‌, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్లకు ఓకే.. యూఏఈ చారిత్రక నిర్ణయం

UAE: అత్యాచారం, అక్రమ సంబంధాల వల్లే కలిగే గర్భాన్ని తొలగించేందుకు అనుమతినిస్తూ అరబ్‌ దేశం యూఏఈ చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది.

Updated : 21 Jun 2024 16:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళలకు సంబంధించి కఠిన చట్టాలను అమలు చేసే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) ఈ మధ్య వారికి కొన్ని సడలింపులు కల్పిస్తోంది. మహిళల హక్కులు, వారి సాధికారత కోసం పలు సంస్కరణలు తీసుకొస్తూ లింగ సమానత్వం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఆ దేశం గర్భవిచ్ఛిత్తి (Abortion)పై చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అత్యాచారం (Rape), అక్రమ సంబంధం వంటి కేసుల్లో అబార్షన్లకు అనుమతించేందుకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు యూఏఈ అధికారిక మీడియా సంస్థ ‘ది నేషనల్‌’ కథనం వెల్లడించింది.

ఈ తీర్మానం ప్రకారం.. అత్యాచారం లేదా వివాహేతర సంబంధం వల్ల మహిళలు గర్భం (Pregnancy) దాల్చితే దాన్ని తొలగించుకునేందుకు అనుమతి లభిస్తుంది. అత్యాచార ఘటనను లేదా అక్రమ సంబంధంతో గర్భం దాల్చిన విషయాన్ని బాధితులు తక్షణమే అధికారులకు చెప్పాలి. దాన్ని నిరూపించే నివేదికను పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ నుంచి తీసుకురావాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

‘ఈసారి నేను మౌనంగా ఉండలేను..’: మిలిందా గేట్స్‌ ఆసక్తికర పోస్ట్‌

మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 120 రోజుల్లోపు గర్భాన్ని మాత్రమే తొలగించేందుకు అనుమతి కల్పించారు. అది కూడా మహిళ ప్రాణానికి ఎలాంటి ముప్పు రాదని నిర్ధరించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాగా.. యూఏఈ (United Arab Emirates)లో కనీసం సంవత్సరం నుంచి ఉంటున్న మహిళలకు మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.

‘‘అత్యాచారం, అక్రమ సంబంధం వంటి కేసుల్లో దోషులను శిక్షించేందుకు అనేక చట్టాలున్నాయి. ఈ నేరాల వల్ల మహిళలకు ఎదురయ్యే గర్భాధారణ సమస్యను పరిష్కరించేందుకు చట్టాలు కావాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని యూఏఈ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం యూఏఈ చట్టాల ప్రకారం.. అత్యాచార కేసుల్లో దోషిగా తేలితే జీవితఖైదు విధిస్తారు. అదే బాధితురాలు 18 ఏళ్లలోపు అమ్మాయి లేదా దివ్యాంగురాలైతే నేరస్థులకు  మరణశిక్ష వేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని