India-UK: మోదీతో భేటీ తర్వాత.. భారతీయులకు రిషి సునాక్ గుడ్‌న్యూస్‌

భారత యువ నిపుణుల కోసం యూకే సరికొత్త వీసా పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద ఏటా 3000 వీసాలు అందించనుంది.

Updated : 16 Nov 2022 11:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూకే వెళ్లాలనుకునే భారతీయులకు బ్రిటన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్‌ ఆమోదం తెలిపారు. జి-20 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో రిషి సునాక్ భేటీ అయిన కొద్ది గంటలకే యూకే ప్రభుత్వం ఈ ప్రకటన వెలువర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.

‘‘యూకే-ఇండియా యువ నిపుణుల వీసా పథకాన్ని ప్రకటిస్తున్నాం. ఈ పథకం కింద భారత్‌కు చెందిన 18-30 ఏళ్ల డిగ్రీ విద్యావంతులకు ఏటా 3000ల వీసాలు అందజేస్తాం. వారు యూకేకు వచ్చి రెండేళ్ల వరకు చదువుకోవడం, ఉద్యోగం చేసుకునేందుకు వీలుంటుంది’’ అని బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం నేడు ట్విటర్‌లో వెల్లడించింది. ఇరు దేశాల మధ్య వలస భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా ఈ పథకాన్ని ఆమోదించామని, దీని కింద ప్రయోజనం పొందిన తొలి దేశం భారత్‌ అని యూకే ప్రభుత్వం తెలిపింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, రెండు ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో బలమైన బంధాలను ఏర్పరుచుకోవడానికి ఈ పథకం దోహదపడుతుందని డౌనింగ్‌ స్ట్రీట్ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా.. జి-20 సదస్సులో ఇరు దేశాధినేతల భేటీ జరిగిన కొద్ది గంటలకే సునాక్‌ సర్కారు ఈ వీసా పథకాన్ని ప్రకటించింది. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగుతున్న జి-20 సదస్సులో భాగంగా భారత ప్రధాని మోదీ, యూకే ప్రధాని రిషి సునాక్‌ నిన్న కొద్దిసేపు ముచ్చటించారు. భారత సంతతికి చెందిన సునాక్‌.. బ్రిటన్‌ అధికార పీఠమెక్కిన తర్వాత.. వీరిద్దరూ ముఖాముఖి మాట్లాడటం ఇదే తొలిసారి.

మరోవైపు, భారత్‌-యూకే మధ్య ప్రస్తుతం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల దశలో ఉంది. ఇది కుదిరితే.. ఓ ఐరోపా దేశంతో భారత్‌ ఈ తరహా ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి కానుంది. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వీలుగా ఈ ఒప్పందంపై ఇరు దేశాలు ఈ ఏడాది ఆరంభంలో చర్చలు ప్రారంభించాయి. దీని ప్రకారం.. రెండు దేశాలు గరిష్ఠ వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలను భారీగా తగ్గించడమో లేదా తొలగించడమో చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పెట్టబడులను ప్రోత్సహించేలా నిబంధనలను సులభతరం చేయాలి. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశకు చేరుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని