Imran Khan: నాలుగో భార్యనవుతా.. ఇమ్రాన్‌ఖాన్‌కు టిక్‌టాకర్‌ ప్రపోజల్‌

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)ను పెళ్లి చేసుకోవాలని ఉందని ఓ టిక్‌టాకర్‌ చెప్పింది. ఆయన వివాహ బంధాన్ని తెంచైనా సరే.. నాలుగో భార్యనవుతానని ఆమె చెబుతోంది.

Published : 31 May 2023 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కేసులు, అరెస్టులతో ఆయన సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు అనూహ్య ప్రతిపాదన ఎదురైంది. యూకేకు చెందిన ఓ టిక్‌టాకర్‌ (Tiktoker) ఆయనకు ప్రపోజ్‌ చేసింది. ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందన్న ఆమె.. ఆయనకు నాలుగో భార్యనవుతానని చెప్పింది. ఈ మేరకు ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

యూకేకు చెందిన జియా ఖాన్‌ (Jia Khan) అనే టిక్‌టాకర్‌ ఈ ప్రతిపాదన చేసింది. ‘‘ఆయన (ఇమ్రాన్‌ ఖాన్‌) ముందు జెమీమాను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అందమైన ఓ జర్నలిస్టు ఆయనకు రెండో భార్యగా వచ్చింది. మూడోసారి ఓ సంప్రదాయబద్ధమైన మహిళను వివాహమాడారు. ఇప్పుడు ఆయన జీవితంలో గ్లామర్‌ నింపాల్సిన అవసరం ఉంది. ఆయనకో అల్లరి చేసే సరదాలు పంచే భార్య కావాలి. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాలుగో భార్యగా ఉండాలనుకుంటున్నా. ఇందుకోసం బుష్రా బీబీతో బంధాన్ని తెంచడానికైనా నేను సిద్ధమే. ఆయన వయసు 70 ఏళ్లు. అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)’’ అని జియా ఖాన్‌ ఆ వీడియోలో పాక్‌ మాజీ ప్రధానిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది.

బుష్రా బీబీతో ఇమ్రాన్ వివాహం చెల్లదని ఇటీవల ఓ మతపెద్ద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.  అయితే దీనిపై ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) స్పందించలేదు. ఇక, 100కు పైగా కేసులను ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌ను ఇటీవల పాక్‌ పారామిలటరీ విభాగం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు. కాగా.. ఇమ్రాన్‌, ఆయన భార్య దేశం విడిచి వెళ్లకుండా పాక్‌ ప్రభుత్వం నిషేధం విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు