UK elections: బ్రిటన్‌ ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన లేబర్‌ పార్టీ అధ్యక్షుడు కీర్‌ స్టార్మర్‌ (61) దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు.

Updated : 06 Jul 2024 04:42 IST

సార్వత్రిక ఎన్నికల్లో 412 స్థానాల్లో లేబర్‌ పార్టీ ఘనవిజయం
121 సీట్లతో సరిపెట్టుకున్న కన్సర్వేటివ్‌ పార్టీ
ఓటమికి తనదే బాధ్యతన్న రిషి సునాక్‌
సత్తా చాటిన 28 మంది భారత సంతతి వ్యక్తులు

లండన్‌: బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన లేబర్‌ పార్టీ అధ్యక్షుడు కీర్‌ స్టార్మర్‌ (61) దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. స్టార్మర్‌ నియామకాన్ని బ్రిటన్‌ కింగ్‌ ఛార్లెస్‌-3 ఆమోదించారు. ఫలితాల అనంతరం స్టార్మర్‌.. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఛార్లెస్‌ ఆయన్ను ఆహ్వానించారు. ఆయన సమక్షంలో దేశ 58వ ప్రధానిగా స్టార్మర్‌ బాధ్యతలు చేపట్టారు. అనంతరం అధికార నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో నూతన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశానికే తన మొదటి ప్రాధాన్యమని, తర్వాతే పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజాసేవ ఒక గౌరవం అని వ్యాఖ్యానించారు. దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రతినపూనారు. స్టార్మర్‌ లండన్‌లోని తన సొంత స్థానం హాల్‌బోర్న్‌-సెయింట్‌ పాంక్రస్‌ నుంచి 18,884 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

సర్వేలు చెప్పినట్లే బ్రిటన్‌ ఎన్నికల్లో స్టార్మర్‌ నాయకత్వంలోని లేబర్‌ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్‌ ఐర్లాండ్‌ వ్యాప్తంగా గల 650 స్థానాలకు గాను 33.7 శాతం ఓట్లతో 412 సీట్లు దక్కించుకుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 201 స్థానాలకే పరిమితమైంది. రిషి సునాక్‌ (44) నేతృత్వంలోని అధికార కన్సర్వేటివ్‌ పార్టీ 23.7 శాతం ఓట్లు పొంది 121 సీట్ల దగ్గర ఆగిపోయింది. 2019తో పోలిస్తే ఏకంగా 250 సీట్లను కోల్పోయింది. మెజారిటీకి 326 సీట్లు అవసరం. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్ది గంటలకే(భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలు) లేబర్‌ పార్టీ 368 సీట్లు సాధించి మ్యాజిక్‌ ఫిగర్‌ను అధిగమించింది. ఫలితాల వెల్లడి మొదలయ్యాక సుందర్‌ల్యాండ్‌లో 18,847 ఓట్ల మెజారిటీతో లేబర్‌ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. తాజా విజయంతో 14 ఏళ్ల తర్వాత లేబర్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. స్టార్మర్‌కు ఫోన్‌ చేసి సునాక్‌ శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్లక్రితం ప్రధానిగా ఎన్నికైన ఆయన ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఫలితాల అనంతరం కింగ్‌ ఛార్లెస్‌-3ని కలిసి సునాక్‌ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజు దాన్ని ఆమోదించారు. బ్రిటన్‌ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. రాత్రి 10 గంటలకు వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు 28 మంది విజయం సాధించారు. 

సొంత స్థానంలో సునాక్‌ గెలుపు

ఫలితాలు వెలువడుతుండగానే బ్రిటిన్‌ ప్రధాని రిషి సునాక్‌ తన పార్టీ ఓటమి అంగీకరించారు. ‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీని విజయం వరించింది. ఆ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను.  మీరు(పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి) నన్ను క్షమించండి. ఓటమికి బాధ్యత వహిస్తున్నా’ అని రిషి సునాక్‌  ప్రకటించారు. ఆయన పోటీ చేసిన రిచ్‌మండ్‌ అండ్‌ నార్తర్న్‌ అలర్టన్‌ స్థానంలో గెలుపొందారు. 


స్టార్మర్‌కు మోదీ శుభాకాంక్షలు 

దిల్లీ: బ్రిటన్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కీర్‌ స్టార్మర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘అనిర్వచనీయమైన విజయాన్ని దక్కించుకున్న కీర్‌ స్టార్మర్‌కు హృదయపూర్వక అభినందనలు. అన్ని రంగాల్లో భారత్‌-యూకే సంబంధాల బలోపేతం దిశగా నిర్మాణాత్మక సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని మోదీ ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు. అలాగే సునాక్‌ను ఉద్దేశించి యూకేను పాలించడంలో అద్భుతమైన పనితీరు చూపారని ప్రశంసించారు. భవిష్యత్తు ప్రయాణం బాగుండాలని ఆకాంక్షిస్తూ సునాక్‌తో పాటు ఆయన కుటుంబానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని