UK elections: బ్రిటన్‌ ఎన్నికల్లో భారత సంతతి హవా.. 26 మంది గెలుపు!

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో భారత సంతతి హవా కొనసాగింది. మొత్తంగా 26 మంది భారత మూలాలున్న వ్యక్తులు పార్లమెంటులో అడుగుపెడుతున్నారు.

Published : 05 Jul 2024 18:52 IST

లండన్‌: బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో (UK Elections) భాగంగా అక్కడి పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో భారత సంతతి హవా కొనసాగింది. దాదాపు 26 మంది భారత మూలాలున్న అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక తెలుగు సంతతికి చెందిన చంద్ర కన్నెగంటి, ఉదయ్‌ నాగరాజులు మాత్రం తాజా ఎన్నికల్లో ఓడిపోయారు.

బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి అభ్యర్థుల్లో రిషి సునాక్‌ ముందున్నారు. రిచ్‌మండ్‌ అండ్‌ నార్తర్న్ అలర్టన్‌ స్థానం నుంచి ఆయన మరోసారి గెలుపొందారు. మాజీ హోంమంత్రులు సుయెల్లా బ్రేవర్మన్‌, ప్రీతి పటేల్‌లు తమ స్థానాలను పదిలంగా ఉంచుకోగలిగారు. భారత సంతతికి చెందిన క్లెయిర్‌ కౌటిన్హో కూడా విజయం సాధించారు. సౌత్‌వెస్ట్‌ హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌ నుంచి కన్జర్వేటివ్‌ నేత గగన్‌ మొహీంద్ర, లైసెస్టర్‌ ఈస్ట్‌ నుంచి శివాని రాజా గెలుపొందారు. లేబర్‌ పార్టీకి చెందిన రాజేశ్‌ అగర్వాల్‌పై శివాని విజయం సాధించారు. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన శైలేష్‌ వారా, తొలిసారి పోటీలో దిగిన అమీత్‌ జోగియాలు స్వల్ప తేడాతో ఓటమి చెందారు.

లేబర్‌ పార్టీ నుంచి..

మొత్తంగా లేబర్‌ పార్టీ నుంచే భారత సంతతి అభ్యర్థులు అధిక సంఖ్యలో బ్రిటన్‌ పార్లమెంటులో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. వీరిలో సీమా మల్హోత్రా (వాల్‌సాల్‌ నియోజకవర్గం), వాలెరీ వాజ్‌ (బ్లోక్స్‌విచ్‌).. ఆమె సోదరి కీత్‌ వాజ్‌, లీసా నాండీ (విగాన్‌)లు భారీ మెజార్టీతో గెలుపొందారు. బ్రిటిష్‌ సిక్కు ఎంపీలు ప్రీత్‌ కౌర్‌ గిల్‌, తన్‌మంజిత్‌ సింగ్‌ ధేహిలు మరోసారి విజయం సాధించారు. నావెందు మిశ్రా, రదిమా విటోమ్‌లు లేబర్‌పార్టీ నుంచి భారీ మెజార్టీతో తమ స్థానాలను పదిలపరచుకున్నారు.

తొలిసారి అడుగుపెడుతూ..

లేబర్‌ పార్టీకి చెందిన జాస్‌ అథ్వాల్‌, బాగీ శంకర్‌, సత్వీర్‌ కౌర్‌, హర్‌ప్రీత్‌ ఉప్పల్‌, వారిందర్‌ జస్‌, గురిందర్‌ జోసన్‌, కనిష్క నారాయణ్‌, సోనియా కుమార్‌, సురీనా బ్రాకెన్‌బ్రిడ్జ్‌, కిరిత్‌ ఎంట్‌విజిల్‌, జీవన్‌ సంధేర్‌, సోజాన్‌ జోసెఫ్‌లు తొలిసారిగా బ్రిటన్‌ పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. వీరితోపాటు లిబరల్‌ డెమోక్రాట్‌ తరఫున మునిరా విల్సన్‌ మరోసారి విజయం సాధించారు.

ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌, వేల్స్‌, నార్తర్న్ ఐర్లాండ్‌ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్‌ పార్టీ 410 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్‌లు కేవలం 118 చోట్ల విజయం సాధించారు. రిషి సునాక్‌ విజయం సాధించగా.. గతంలో 49 రోజుల పాటు ప్రధానిగా పనిచేసిన లిజ్‌ ట్రస్‌ మాత్రం ఓటమి పాలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు