UK new visa: ప్రతిభావంతులకు బ్రిటన్‌ తలుపులు బార్లా..

ప్రపంచం నలుమూలల నుంచి అత్యంత ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్లు తమ దేశానికి వచ్చి పనిచేసుకునేందుకు వీలు కల్పించేలా బ్రిటన్‌ సరికొత్త వీసా కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టింది. ‘అధిక సత్తా ఉన్న అభ్యర్థుల (హెచ్‌పీఐ) వీసా’గా

Updated : 31 May 2022 19:53 IST

టాప్‌-50 విశ్వవిద్యాలయాల విద్యార్థుల కోసం ప్రత్యేక వీసాలు
భారతీయులకు ప్రయోజనం చేకూరే అవకాశం

లండన్‌: ప్రపంచం నలుమూలల నుంచి అత్యంత ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్లు తమ దేశానికి వచ్చి పనిచేసుకునేందుకు వీలు కల్పించేలా బ్రిటన్‌ సరికొత్త వీసా కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టింది. ‘అధిక సత్తా ఉన్న అభ్యర్థుల (హెచ్‌పీఐ) వీసా’గా దానికి నామకరణం చేసింది. జాతీయతతో సంబంధం లేకుండా.. ప్రపంచంలోని 50 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో (బ్రిటన్‌లో ఉన్నవాటిని మినహాయించి) గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ఈ కార్యక్రమం కింద వీసాలు మంజూరు చేస్తారు. ఇది భారతీయులకూ ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. హెచ్‌పీఐ వివరాలను భారత సంతతికి చెందిన కేబినెట్‌ మంత్రులు రుషి సునక్‌, ప్రీతి పటేల్‌ ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

ఇందులో అర్హులైనవారికి బ్రిటన్‌లో ఉద్యోగమేమీ ఖరారు కాకున్నా రెండేళ్ల వర్క్‌ వీసా లభిస్తుంది. అభ్యర్థులు పీహెచ్‌డీ పట్టభద్రులైతే.. వీసా గడువు మూడేళ్ల వరకు ఉంటుంది. హెచ్‌పీఐ వీసాదారులు తమపై ఆధారపడ్డవారిని లేదా సన్నిహిత కుటుంబసభ్యులను తమతో పాటు బ్రిటన్‌కు తీసుకెళ్లొచ్చు. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, క్యూఎస్‌, అకడమిక్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ వరల్డ్‌ యూనివర్సిటీస్‌ విడివిడిగా రూపొందించిన జాబితాల ప్రకారం టాప్‌-50 విశ్వవిద్యాలయాలను (బ్రిటన్‌ వెలుపల) ఎంపిక చేశారు. బ్రిటన్‌ను అంతర్జాతీయ వ్యాపార, సృజనాత్మక, నవకల్పనల కేంద్రంగా తీర్చిదిద్దేందుకే హెచ్‌పీఐ వీసా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సునక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని