UK: అకారణంగా దాడి.. సగం పుర్రె కోల్పోయిన వ్యక్తి..!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న సమయంలో ఓ వ్యక్తి చేసిన దాడికి తన పుర్రె (Skull) సగ భాగాన్ని కోల్పోవాల్సి వచ్చిందని బ్రిటన్‌కు (Britain) చెందిన ఓ యువకుడు వాపోయాడు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి భయటపడ్డానని.. కానీ, ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే హెల్మెట్‌ పెట్టుకోవాల్సి వస్తుందని తెలిపాడు.

Published : 25 Feb 2023 01:44 IST

లండన్‌: ఎవరైనా ఆవేశంలో చేసే పనులు, దాడులు ఒక్కోసారి ఇతరుల ప్రాణాల మీదకు తెస్తాయి. ఇటువంటి దారుణ ఘటనే గతేడాది బ్రిటన్‌(Britain)లో చోటుచేసుకుంది. అకారణంగా ఓ వ్యక్తి చేసిన దాడి తీవ్రతకు బాధితుడు కోమాలోకి (Coma) వెళ్లిపోయాడట. చివరకు శస్త్రచికిత్స అనంతరం అతడి పుర్రె (Skull) భాగాన్ని కొంత తొలగించాల్సి వచ్చింది. మరోసారి తలకు దెబ్బ తగిలితే మాత్రం తన ప్రాణాలే పోతాయని భయపడుతోన్న ఆ బాధితుడు.. బయటకు వెళ్లిన ప్రతిసారి హెల్మెట్‌ పెట్టుకుంటున్నట్లు మీడియా ముందు వాపోయాడు.

లండన్‌లోని డెర్బీషైర్‌కు చెందిన బ్రాండెన్‌ స్ట్రామ్‌బెర్గ్‌ అనే యువకుడు గతేడాది మే నెలలో తన ప్రేయసితో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో వెనకనుంచి వచ్చిన ఓ వ్యక్తి స్ట్రామ్‌బెర్గ్‌ తలపై చేతితో గట్టి పంచ్‌ ఇచ్చాడు. ఆ దెబ్బకు స్ట్రామ్‌బెర్గ్‌ రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు మెదడులో తీవ్ర రక్తస్రావం అయినట్లు గుర్తించారు. అలా ఓ 15రోజుల పాటు కోమాలోనే ఉండిపోయాడు. అతడికి సర్జరీ నిర్వహించిన వైద్యులు స్ట్రామ్‌బెర్గ్‌ సగం పుర్రెను తొలగించారు.

ఇటీవల కోలుకున్న అతను జ్ఞాపకశక్తి కోల్పోయాడు. అయితే, దాడి ఘటనకు సంబంధించి పూర్తి విషయాలను తన ప్రేయసి చెప్పిందని స్థానిక మీడియాకు వివరించాడు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీతోపాటు సర్జరీ వివరాలను వెల్లడించాడు. ఆ దాడి కారణంగా తన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని.. ఓ కన్ను, చేయి కూడా సరిగా పనిచేయడం లేదని వాపోయాడు. ఇంతటి తీవ్రమైన దాడికి పాల్పడిన నిందితుడికి కేవలం రెండేళ్ల శిక్ష మాత్రమే విధించారంటూ బ్రాండెన్‌ స్ట్రామ్‌బెర్గ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ యువకుడికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని