Boris Johnson: ‘పార్టీగేట్‌’ కుంభకోణం ఎఫెక్ట్‌.. బోరిస్‌ జాన్సన్‌కు భంగపాటు

బ్రిటన్‌లో ‘పార్టీగేట్‌’ కుంభకోణం ఎఫెక్ట్‌ కొనసాగుతోంది. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు చేదు జ్ఞాపకాలను మిగుల్చుతోంది........

Published : 04 Jun 2022 01:39 IST

లండన్‌: బ్రిటన్‌లో ‘పార్టీగేట్‌’ కుంభకోణం ఎఫెక్ట్‌ కొనసాగుతోంది. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు చేదు జ్ఞాపకాలను మిగుల్చుతోంది. బ్రిటన్‌ సింహాసనాన్ని క్వీన్‌ ఎలిజెబెత్‌-2 అధిష్ఠించి 70 ఏళ్లవుతున్న సందర్భంగా లండన్‌లో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరైన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. క్వీన్‌ ఎలిజెబెత్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు భార్య క్యారీతో కలిసి లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్‌కు బోరిస్‌ వెళ్లారు. అయితే అక్కడ ఉన్న ప్రజల్లో కొంతమంది పరుష పదజాలంతో హేళన చేశారు. వెకిలిగా మాట్లాడారు. అయితే మరికొందరు మాత్రం చప్పట్లతో ఆయనకు స్వాగతం పలికారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన మాజీ ప్రధానికి ప్రజల నుంచి ఘనస్వాగతం లభించడం విశేషం.

కొవిడ్‌-19 నిబంధనలు ఉల్లంఘించి.. ప్రభుత్వంలోని నేతలు, అధికారులతో కలిసి ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మద్యం విందులో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ‘పార్టీగేట్‌’ కుంభకోణంగా పిలిచే ఈ విందులపై ఏర్పాటు చేసిన స్యూ గ్రే కమిషన్‌ తన తుది నివేదికను సమర్పించింది. ఇందులో ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మద్యం విందులకు సీనియర్‌ నాయకత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జాన్సన్‌.. నివేదికలోని అంశాలను పార్లమెంట్‌లో అంగీకరించారు. పార్లమెంట్‌ వేదికగా క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి, ముందుకు కదులుదామని, ప్రభుత్వ ప్రాధాన్యతలపై దృష్టి పెడదామని పేర్కొన్నారు.

క్వీన్‌ ఎలిజెబెత్‌-2 ప్లాటినం జూబ్లీ వేడుకలు లండన్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రిటీష్‌ సైనిక సంప్రదాయం ప్రకారం గుర్రాలు, ఆయుధాలు, ఫైటర్‌ జెట్లతో ప్రదర్శన నిర్వహించారు. నాలుగు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. తొలిరోజు గురువారం బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లోని బాల్కనీ నుంచి రాణి గౌరవ వందనం స్వీకరించారు. 70 ఏళ్ల ప్రస్థానానికి చిహ్నంగా చివరి రోజున 70 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఆకాశంలో విన్యాసాలు చేయనున్నాయి. వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. 1953 జూన్‌ 2న ఎలిజెబెత్‌ రాణి పట్టాభిషేకం జరిగింది. 96 ఏళ్ల క్వీన్‌ ఎలిజెబెత్‌-2 బ్రిటన్‌లో ఎక్కువ కాలం సింహాసనాన్ని అధిష్ఠించిన రాణిగా చరిత్రలో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని