UK Politics: బ్రిటన్‌ ఆర్థికశాఖ మంత్రిపై వేటు.. ట్రస్‌ కీలక నిర్ణయం

బ్రిటన్‌ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్‌పై ప్రధాని లిజ్‌ ట్రస్‌ వేటు వేశారు.

Published : 14 Oct 2022 21:33 IST

లండన్‌:  బ్రిటన్‌లో పన్నుల కోత వ్యవహారం వివాదాస్పదమవుతోన్న సమయంలో అక్కడి రాజకీయాల్లో (UK Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిటన్‌ ఆర్థిక మంత్రి (Chancellor) క్వాసీ క్వార్టెంగ్‌పై ప్రధాని లిజ్‌ ట్రస్‌ వేటు వేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌ వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన క్వాసీ క్వార్టెంగ్‌.. ప్రధాని (Liz Truss) సూచనల మేరకు ఛాన్సలర్‌ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన కేవలం 38 రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగినట్లైంది.

పన్ను కోతలపై సెప్టెంబర్‌లో ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్‌ వల్ల మార్కెట్లు కుదేలవుతున్నట్లు వార్తలు వచ్చాయి. డాలర్‌తో పోలిస్తే పౌండ్‌ రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో ఇంగ్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్‌లో మార్పులకు బ్రిటన్‌ ప్రభుత్వం ఉపక్రమించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం ప్రధాని లిజ్‌ ట్రస్‌ విలేకరుల సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ముందే ప్రధాని సూచన మేరకు ఛాన్సలర్‌ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.

అయితే, అంతర్జాతీయ ద్రవ్యనిధి సమావేశంలో పాల్గొనేందుకు ఆర్థికమంత్రి క్వాసీ క్వార్టెంగ్‌ అమెరికా వెళ్లారు. ఇదే సమయంలో ప్రధానితో వెంటనే భేటీ కావాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో పదవిని వీడాల్సి వస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిని ఖండించిన ఆయన.. తాను ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. కానీ, షెడ్యుల్‌ కన్నా ఒకరోజు ముందే బ్రిటన్‌కు బయలుదేరిన ఆయన.. ప్రభుత్వాన్ని వీడుతున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని