UK PM: తప్పులు చేశాం..క్షమించండి : బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌లో ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్‌ తీవ్ర వివాదాస్పదం కావడంపై స్పందించిన ప్రధాని లిజ్‌ ట్రస్‌.. తాము తప్పిదాలు చేశామని, అందుకు క్షమించండని పేర్కొన్నారు.

Published : 18 Oct 2022 15:17 IST

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రిగా (UK PM) బాధ్యతలు చేపట్టిన కొన్ని వారాల్లోనే లిజ్‌ ట్రస్‌ (Liz Truss) తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతోపాటు సొంతపార్టీ సభ్యుల నుంచే ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తొలిసారి స్పందించిన లిజ్‌ ట్రస్‌.. తాము తప్పిదాలు చేశామని.. అందుకు క్షమించండి.. అని పేర్కొన్నారు. తాను ఎక్కడికీ వెళ్లనని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా కొనసాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెలలోపు ప్రధానిపై అవిశ్వాసం పెట్టేందుకు పార్లమెంటు సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో లిజ్‌ ట్రస్‌ ఈవిధంగా స్పందించారు.

‘మేం తప్పులు చేశామని గుర్తించాను. ఆ తప్పిదాలకు నన్ను క్షమించండి, ఇప్పటికే ఆ తప్పులను సరిచేసుకున్నాను. కొత్త ఛాన్సలర్‌ను నియమించాను. ఆర్థిక స్థిరత్వం, క్రమశిక్షణను పునరుద్ధరించాం. ఇలాగే ముందుకు వెళ్తూ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం. 2019 మేనిఫెస్టో ఆధారంగా మేం ఎన్నికయ్యాం. వాటిని అమలు చేయాలని భావిస్తున్నాం’ అని బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామన్న లిజ్‌.. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ పరిస్థితులూ ప్రతికూలంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఇటువంటి సమయంలో ఇంధన ప్యాకేజీపైనా దృష్టి పెట్టామని చెప్పారు.

ప్రధాని లిజ్‌ ట్రస్‌ ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్‌లో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో  ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో లిజ్‌ ట్రస్‌పై ఈ నెల 24లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పాలక కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన 100 మంది పార్లమెంటు సభ్యులు యోచిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని