Rishi Sunak: కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన రిషి సునాక్‌ కుమార్తె..

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తొమ్మిదేళ్ల కుమార్తె అనౌష్క కూచిపూడి నృత్యంతో ఆకట్టుకుంది. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె నృత్య ప్రదర్శన ఇచ్చింది.

Published : 27 Nov 2022 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ మూలాలు ఉన్న బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్‌కు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలంటే అపారమైన అభిమానం. వీలు చిక్కినప్పుడల్లా దేవాలయాలను సందర్శించుకోవడంతో పాటు భారతీయ పండగలను రిషి కుటుంబం ఘనంగా చేసుకుంటుంది. తండ్రి బాటలోనే రిషి కుమార్తె కూడా భారతీయ కళల పట్ల మక్కువ చూపుతోంది. ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె అనౌష్క సునాక్.. మన సంప్రదాయ నృత్యాల్లో ఒకటైన కూచిపూడిలో శిక్షణ తీసుకుంటోంది. నేర్చుకోవడం మాత్రమే కాదు.. తాజాగా లండన్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో అనౌష్క నృత్య ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకుంది.

లండన్‌లో ‘రాంగ్‌ - 2022’ పేరుతో ఇంటర్నేషనల్‌ కూచిపూడి డ్యాన్స్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 4 -85ఏళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో పాల్గొన్న రిషి కుమార్తె అనౌష్క సునాక్‌ మరికొందరు చిన్నారులతో కలిసి ఇచ్చిన కూచిపూడి నృత్యప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి రిషి సతీమణి అక్షతా మూర్తి, ప్రధాని తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్‌తో అనౌష్క మాట్లాడుతూ.. తనకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఇక భారత్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కుటుంబం, ఇల్లు, సంస్కృతి సంప్రదాయాలు మిళితమైన దేశం భారత్‌. అక్కడకు వెళ్లడం నాకు చాలా ఇష్టం’’ అని ఉత్సాహంగా చెప్పింది.

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని రిషి సునాక్‌ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 2009లో బెంగళూరులో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణ సునాక్‌, అనౌష్క సునాక్‌. సంప్రదాయాలకు ఎక్కువగా విలువిచ్చే రిషి దంపతులు తమ పిల్లలకు కూడా వాటిని చిన్నప్పటి నుంచే నేర్పుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని