Boris Johnson: ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా

బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ రోజు ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని యూకే మీడియా వర్గాలు వెల్లడించాయి.

Updated : 17 Oct 2022 11:32 IST

లండన్‌: బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ నేతలను నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు బోరిస్ ఈ రోజు రాజీనామాకు అంగీకరించిన సంగతి తెలిసిందే.  పార్టీ అధినేత పదవి నుంచి తప్పుకొనేందుకు కూడా ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు. ఆయన రాజీనామా విషయాన్ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు వెల్లడించారు.

బోరిస్ నాయకత్వంపై ఆయన మంత్రులు, అధికారులు విశ్వాసం కోల్పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జాన్సన్‌ వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా.. బుధవారం మరో 15 మంది మంత్రులు పదవులను వీడారు. ఇప్పటివరకూ 40 మందికి పైగా మంత్రులు తమ పదవుల నుంచి దిగిపోయారు. కొన్ని గంటల క్రితం బోరిస్ నియమించిన ఇరాక్‌ జాతీయుడైన నదిమ్‌ జహావి (ఆర్థిక మంత్రి) కూడా ప్రధాని దిగిపోవాలని డిమాండ్ చేశారు. ‘వెళ్లిపోవడమే ఇప్పుడు మీరు చేయాల్సిన సరైన పని’అని వ్యాఖ్యానించారు.

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకొన్నారు. కరోనా సమయంలో అధికార నివాసంలో పార్టీ చేసుకున్నందుకు గానూ ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. 2019లో ప్రధాని జాన్సన్‌... క్రిస్‌ పించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా నియమించారు. అప్పటికే అతని నడవడికకు సంబంధించి పలు ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులు చెప్పినా జాన్సన్‌ పట్టించుకోకుండా క్రిస్‌ పించర్‌ను కీలకమైన పదవిలో కూర్చోబెట్టారు. ఇటీవల క్రిస్‌ ఒక క్లబ్‌లో తాగిన మత్తులో ఇద్దరు వ్యక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

అయితే అతను ఇలాంటి వాడని తనకు తెలియదని ప్రధాని బోరిస్‌ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, పించర్‌ గురించి తాము ముందే నివేదించామని మాజీ అధికారి ఒకరు చెప్పడంతో బోరిస్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇది మంత్రులు, ఉన్నతాధికారుల రాజీనామాలకు దారితీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని