Britain royal family: బ్రిటన్‌ రాజు పట్టాభిషేకం.. ఉపయోగించే ఆభరణాలివే!

బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌-3 (King Charles III) పట్టాభిషేకంలో భాగంగా మే 6న నిర్వహించబోయే కార్యక్రమంలో ఏయే అభరణాలను, వస్తువులను వినియోగిస్తారో బ్రిటన్‌ రాజ కుటుంబం (Britain Royal Family) ట్విటర్ ద్వారా వెల్లడించింది.

Published : 11 Apr 2023 01:48 IST

లండన్: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మరణం తర్వాత ఆ స్థానంలో కింగ్‌ ఛార్లెస్‌-3కి పట్టాభిషేకం చేయాలని రాయల్‌ ఫ్యామిలీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 6న ఆయనకు రాజకుటుంబ సంప్రదాయాల ప్రకారం పట్టాభిషేకం నిర్వహించనున్నారు. తాజాగా ఆ రోజున రాజుతోపాటు భార్య కెమిల్లాకు అలంకరించబోయే నగల వివరాలను రాయల్‌ ఫ్యామిలీ వెల్లడించింది.

‘‘ రాజకిరీటంలో పొదిగిన నగలు దేశంలోనే అత్యంత విలువైనవి. పట్టాభిషేక వేడుకలో ఉపయోగించే వస్తువులు.. రాజు అధికారాలను, బాధ్యతలను సూచిస్తాయి. వందల ఏళ్ల రాజప్రస్థానంలో పట్టాభిషేకానికి ప్రత్యేక పాత్ర ఉంది. బ్రిటన్‌ రాజకుటుంబ సంప్రదాయం ప్రకారం.. మే 6న వెస్ట్‌మినిస్టర్‌లోని అబేలో ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతుంది’’ అని రాయల్‌ఫ్యామిలీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

పట్టాభిషేక సమయంలో ఉపయోగించే ఆభరణాలు, వస్తువులివే..

1. సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటం

ఇది పూర్తిగా సాలిడ్‌ బంగారంతో చేసిన కిరీటం. విలువైన రాళ్లను ఇందులో అమర్చారు. పట్టాభిషేక సమయంలో దీనిని రాజు తలపై ఉంచుతారు. 1649లో అప్పటి మధ్యయుగంనాటి కిరీటం పాడైపోవడంతో దానికి బదులు 1661లో కింగ్‌ చార్లెస్‌-2 కోసం దీనిని తయారు చేశారు.

2. క్వీన్‌ మేరీ కిరీటం

పట్టాభిషేకం సమయంలో రాణికి ఈ కిరీటాన్ని ధరిస్తారు. పట్టాభిషేక కార్యక్రమానికి ముందు కిరీటంలో చిన్నపాటి మార్పులు చేయనున్నారు. క్వీన్‌ ఎలిజబెత్‌-2 వ్యక్తిగత ఆభరణాలైన కలినన్‌ 3, 4, 5 వజ్రాలను కిరీటానికి పొదుగుతారు.

3. ది ఇంపీరియల్‌ స్టేట్‌ కిరీటం

పట్టాభిషేకం ముగింపు సమయంలో ‘సెయింట్‌ ఎడ్వర్డ్స్‌ కిరీటం’ ధరించడానికి ముందు రాజు ఈ కిరీటాన్ని ధరిస్తారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవాల సమయంలోనూ ఈ కిరీటాన్ని ఉపయోగిస్తారు.

4.పట్టాభిషేక స్పూన్‌

పట్టాభిషేక కార్యక్రమంలో ఉపయోగించిన అన్ని వస్తువుల్లోకెల్లా ఇది అత్యంత ప్రాచీనమైనది. క్రతువులో భాగంగా రాజు తలకు పవిత్రమైన తైలాన్ని రాసేటప్పుడు ఈ స్పూన్‌ను ఉపయోగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని