Covid Study: 10 రోజులైనా కొందరువైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారు!

ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, పాజిటివ్‌గా తేలి 10 రోజుల ఐసొలేషన్‌లో ఉన్న తర్వాత కూడా.. పది మందిలో ఒకరు వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నట్లు తాజాగా ఓ బ్రిటన్‌ అధ్యయనంలో...

Published : 18 Jan 2022 18:31 IST

బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, పాజిటివ్‌గా తేలి 10 రోజుల ఐసోలేషన్‌లో ఉన్న తర్వాత కూడా.. పది మందిలో ఒకరు వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నట్లు తాజాగా ఓ బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఇక్కడి ఎక్సెటర్‌ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ బృందం చేపట్టిన ఈ పరిశోధన వివరాలు.. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌’లో ప్రచురితమయ్యాయి. బ్రిటన్‌లోని ఎక్సెటర్‌కు చెందిన 176 మంది పాజిటివ్‌ వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా ఈ అధ్యయనం సాగించారు. 13 శాతం మంది 10 రోజుల తర్వాత కూడా ఇతరులకు వ్యాప్తి చేయగల స్థాయి యాక్టివ్‌ వైరస్‌ కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. కొంతమందిలో 68 రోజుల వరకూ ఇది కొనసాగినట్లు తెలిపారు. ఇంగ్లాండ్‌ తదితర చోట్ల కరోనా సోకినవారికి ఐసొలేషన్‌ సమయాన్ని తగ్గిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఈ ఫలితాలు బయటకు వచ్చాయి.

‘ఇది చిన్న అధ్యయనమే. అయినప్పటికీ.. కొందరిలో యాక్టివ్‌ వైరస్ కొన్నిసార్లు 10 రోజులకు మించి కొనసాగవచ్చని మా ఫలితాలు చెబుతున్నాయి. దీంతో ఇది ఇతరులకు సోకే ప్రమాదం ఉంది’ అని ఈ అధ్యయనాన్ని పర్యేవేక్షించిన ప్రొ.లోర్నా హ్యారీస్ తెలిపారు. అయితే, అలాంటి వారిని గుర్తించడం కష్టమని చెప్పారు. ‘సంప్రదాయిక పీసీఆర్‌ పరీక్షలు.. సేకరించిన నమూనాల్లో వైరస్‌ ఉందో లేదో చెప్పగలుగుతాయి. కానీ, అది ఇంకా యాక్టివ్‌గా ఉందో లేదో గుర్తించలేవు. ఈ అధ్యయనంలో ఉపయోగించిన కొత్త తరహా టెస్టులు మాత్రం వైరస్ యాక్టివ్‌ ఉండి, ఇతరులకు వ్యాపించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే పాజిటివ్‌గా చెబుతాయి’ అని వివరించారు. ఈ నేపథ్యంలో మహమ్మారి బారినపడినవారు చికిత్స పొందిన తర్వాత.. వైరస్‌ యాక్టివ్‌గా ఉందో లేదో నిర్ధారించుకోవాల్సి ఉంటుందని ఈ అధ్యయానికి నాయకత్వం వహించిన మెర్లిన్ డేవిస్ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని