Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. రంగంలోకి ‘అణు’ తూటాలు..!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇప్పుడు రేడియో ధార్మిక ఆయుధాలు వాడకం మొదలవుతోంది. ఇది యుద్ధం దశను మార్చే ప్రమాదముంది. 

Updated : 27 Mar 2023 13:53 IST


ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

రష్యా (Russia) - ఉక్రెయిన్‌ ( Ukraine) యుద్ధం ప్రపంచానికి ముచ్చెమటలు పోయిస్తోంది. రేడియో ధార్మిక ఆయుధాల వినియోగానికి ఇరుపక్షాలు సిద్ధమైపోయాయి. ఓ పక్క రష్యా ఇసికందర్‌ అణు క్షిపణులను బెలారస్‌ తరలించగా.. మరోవైపు బ్రిటన్‌ డిప్లిటెడ్‌ యూరేనియంతో చేసిన తూటాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు సిద్ధమైపోయింది. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్‌కు అణు పరికరాలను అందిస్తున్నారని ఆరోపించారు. బ్రిటన్‌ గనుక వీటిని ఉక్రెయిన్‌కు అందిస్తే తమదైన శైలిలో స్పందించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆయుధాలు వాడితే కొన్ని వందల కిలోమీటర్ల మేరకు రేడియోధార్మికత విస్తరించి ప్రజల ప్రాణాలను కబళించనుంది. అక్కడి గాలి, నీరు విషపూరితంగా మారిపోనున్నాయి. డర్టీ బాంబువలే విస్ఫోటాలు తక్కువ ఉన్నా.. తదనంతర పరిణామాలను అక్కడి ప్రజలు తరాల తరబడి అనుభవించే ప్రమాదముంది.

అసలేమిటీ డిప్లిటెడ్‌ యూరేనియం..?

అణ్వాయుధాలు తయారు చేయడానికి యూరేనియం వినియోగిస్తారు. ఇది యూ-238 రూపంలో ఉంటుంది. దీనిలో 0.72శాతం మాత్రమే యూ-235 యూరేనియం ఉంటుంది. ఇది మాత్రమే అణ్వాయుధాల్లో వాడతారు. ముడి యూరేనియంను శుద్ధిచేసి దీనిని వెలికి తీస్తారని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ క్రమంలో వచ్చే ఉప ఉత్పత్తిని డిప్లిటెడ్‌ యూరేనియం అంటారు. ఇది అణు విచ్ఛిత్తిని సృష్టించలేదు. కానీ, చాలా దళసరిగా ఉంటుంది. సాధారణంగా లెడ్‌ వంటి లోహాల కంటే బలంగా ఉంటుంది. దీంతో ప్రొజెక్టైల్స్‌ (భారీ తూటాలు) తయారీకి ఇది చాలా అనువైంది. డిప్లిటెడ్‌ యూరేనియం అమర్చిన తూటాను పేల్చితే ఓ బలమైన ఆయుధం వలే పనిచేస్తుంది. ఈ క్రమంలో ట్యాంకులకు అమర్చే బలమైన లోహ కవచాలను కూడా చీల్చుకొని వెళుతుంది. దీనికి తోడు అది కొన్ని వందల డిగ్రీల సెంటీగ్రేడ్‌ వేడిని అందుకొంటే స్వయంగా మండుతుంది.  అమెరికా 1970 నుంచి వీటితో కవచ ఛేదక తూటాలను తయారు చేయడం మొదలుపెట్టింది. దీంతోపాటు ట్యాంక్‌ కవచాలు తయారు చేసే మిశ్రమాల్లో కూడా వాడుతోంది. ట్యాంక్‌ కిల్లర్‌గా పిలిచే ఏ-10 విమానాలు ఉపయోగించే తూటాల్లో కూడా ఈ రకం యూరేనియం వినియోగిస్తోంది. అమెరికా ఇప్పటికీ ఈ రకం యూరేనియంతో ఆయుధాలను చేస్తోంది. వీటిల్లో ఎం1ఏ2 అబ్రామ్స్‌ ట్యాంకులు వాడే ఎం829ఏ4 తూటాలు కీలకమైనవి. 

ఇరాక్‌లోని ఫలూజాను రెండో చర్నోబిల్‌గా మార్చిన అమెరికా..

2003లో ఇరాక్‌పై అమెరికా చేపట్టిన యుద్ధంలో దాదాపు 10 వేల రౌండ్ల డిప్లిటెడ్‌ యూరేనియం(డీయూ) తూటాలు వాడినట్లు ది గార్డియన్‌ 2014లో కథనం వెలువరించింది. ఈ విషయాన్ని డచ్‌ గ్రూప్‌ పాక్స్‌ కనుగొన్నట్లు పేర్కొంది. ప్రజలు నివసించే పలు ప్రాంతాల వద్ద డీయూ తూటాలు వాడినట్లు పేర్కొంది. బస్రా, సమవహ,నస్రియా, ఫలూజా వద్ద భారీగా వీటిని ప్రయోగించింది. డీయూ తూటాలను కేవలం ట్యాంకులు, కవచ వాహనాలపైనే వాడాలని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ 1975లో ఇచ్చిన సలహాకు ఇది పూర్తిగా వ్యతిరేకం. ఇరాక్‌లోని 300 ప్రదేశాల్లో డియూ తూటాల అవశేషాలను గుర్తించారు. వీటిని శుభ్రం చేయడానికి అప్పట్లోనే కనీసం 30 మిలియన్‌ డాలర్లు అవుతుందని అంచనావేశారు. కానీ, 2003లో ఇరాక్‌ యుద్ధంలో 3 లక్షల రౌండ్ల డిప్లిటెడ్‌ యూరేనియం రౌండ్లు వాడినట్లు, 1991 యుద్ధంలో 7లక్షలకు పైగా రౌండ్లు వాడినట్లు అంచనాలున్నాయి. వీటిల్లో చాలా వరకు అమెరికా ప్రయోగించగా.. మిగిలినవి సంకీర్ణ సేనలు వాడినట్లు భావిస్తున్నారు. రష్యాకు చెందిన రేడియోలాజికల్‌, కెమికల్‌ అండ్‌ బయోలాజికల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు కమాండర్‌ ఇగోర్‌ కిర్లోవ్‌ స్పందిస్తూ ఇరాక్‌ యుద్ధంలో అమెరికా 300 టన్నుల డిప్లిటెడ్‌ యూరేనియం వాడినట్లు ఆరోపించారు. ఈ దెబ్బకు ఇరాక్‌లోని ఫలూజా నగరంలో హిరోషిమా, నాగసాకీ కంటే అత్యధిక రేడియేషన్‌ ఉందని పేర్కొన్నారు. ఈ నగరం రెండో చెర్నోబిల్‌గా మారిందన్నారు. 2018లో అల్‌ అరేబియా పత్రిక కథనం ప్రకారం ఇరాక్‌లో పుట్టుకతోనే వైకల్యంతో ఉండేవారి సంఖ్య భారీగా పెరిగిపోయినట్లు పేర్కొంది. ఇక ఫలూజా నగరంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

ప్రపంచంలో మరే దేశాల వద్దైనా ఈ రకం ఆయుధాలున్నాయా..?

డిప్లిటెడ్‌ యూరేనియంతో అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, రష్యా, చైనా, పాకిస్థాన్‌ దేశాలు ఆయుధాలను తయారు చేశాయి. వీటిని అణ్వాయుధాల కోవలో చేర్చరు. ఇవే కాక మరో 14 దేశాల వద్ద కూడా అటువంటి ఆయుధ నిల్వలు ఉన్నాయి. 

వీటి వాడకం ప్రమాదకరమా..?

డిప్లిటెడ్‌ యూరేనియంతో చేసిన ఆయుధాలను అణ్వస్త్రాల కోవలోకి చేర్చకపోయినా.. నిపుణులు మాత్రం వాటి వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని వినియోగించినప్పుడు స్వల్పస్థాయిలో రేడియేషన్‌ వ్యాపిస్తుందని చెబుతున్నారు. దాంతో అక్కడి ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. యూరేనియం శరీరంలో చేరినా.. పీల్చినా ప్రమాదకరమే. ఇది కిడ్నీలను దెబ్బతీస్తుంది. వివిధ రకాల క్యాన్సర్లకు కారణం అవుతుంది. యూరేనియం నిషేధంపై అంతర్జాతీయ సమాఖ్య ప్రకారం డిప్లిటెడ్‌ యూరేనియం తూటా గురితప్పి నేలను తాకినా.. అక్కడి భూమి, నీరు కలుషితమైపోతాయి. 

అవి అణ్వాయుధాలు కాదు.. మేము సహించం..!

డీయూ తూటాల సరఫరాలపై బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లావెర్లీ స్పందిస్తూ అవి అణ్వాయుధాలు కాదన్నారు. యూరేనియం అన్న పేరున్నంత మాత్రాన అవి అణ్వాయుధాలు కావని అర్థం చేసుకోవాలన్నారు. అవి పూర్తిగా సంప్రదాయ ఆయుధాలేనని పేర్కొన్నారు. రష్యా మాత్రం ఈ నిర్ణయంపై అగ్గిమీద గుగ్గిలమైంది. అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ డీయూ తూటాలను సరఫరా చేస్తే.. తాము తగిన విధంగా స్పందిస్తామని పేర్కొన్నారు. అది ఎలా అనేది మాత్రం చెప్పబోమన్నారు. పశ్చిమ దేశాలు అణుపరికరాలతో తయారు చేసిన ఆయుధాలను వాడుతున్నాయని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని