Published : 18 Mar 2022 14:08 IST

Ukraine Crisis: రష్యా రాకెట్‌ దాడిలో ఉక్రెయిన్‌ నటి మృతి..!

ధ్రువీకరించిన కీవ్‌ మీడియా

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతోన్న భీకర దాడులకు అక్కడి ప్రధాన నగరాలన్నీ వణికిపోతున్నాయి. ముఖ్యంగా రష్యా సేనలు జన సముదాయాలు, వైద్యశాలలు, థియేటర్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడుల్లో సైనికులతోపాటు వందల సంఖ్యలో మహిళలు, చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కీవ్‌లోని ఓ బిల్డింగ్‌పై రష్యా సేనలు జరిపిన రాకెట్‌ దాడిలో ఉక్రెయిన్‌ కళాకారిణి, నటి ఒక్సానా షెవెట్స్‌ (67) మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఒక్సానా సభ్యురాలిగా ఉన్న యంగ్‌ థియేటర్‌ అనే సంస్థ వెల్లడించింది. ఇదే విషయాన్ని ధ్రువీకరించిన కీవ్‌ మీడియా.. రష్యా యుద్ధంలో ఒక్సానా హత్యకు గురైందని పేర్కొంది.

ఉక్రెయిన్‌లో కొన్ని దశాబ్దాల కాలంగా వెండితెరపై వెలిగిన ఒక్సానా.. థియేటర్‌ కళాకారిణిగా, నటిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో దేశంలోని అత్యున్నత పురస్కారాలనూ సొంతం చేసుకున్నారు. కేవలం థియేటర్‌ ఆర్టిస్టుగానే కాకుండా ఉక్రెయిన్‌ సినిమాలు, టీవీ షోల్లో ఆమె ఎంతో పాపులర్‌గా నిలిచారు.

ఇదిలాఉంటే, సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌లో రష్యా చేస్తోన్న దండయాత్ర మారణహోమాన్ని సృష్టిస్తోంది. దాడులు, ప్రతిదాడులతో వేల సంఖ్యలో ఇరు పక్షాల సైనికులతోపాటు ఉక్రెయిన్‌లోని సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్‌ రక్షణశాఖ లెక్కల ప్రకారం, ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 14వేల మందికిపైగా రష్యా సైనికులు మృత్యువాతపడ్డారు. అంతేకాకుండా భారీ స్థాయిలో యుద్ధ సామగ్రి ధ్వంసమైంది. మరోవైపు ఉక్రెయిన్‌లో ఇప్పటి వరకు 600 సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో వెయ్యిమందికిపైగా తీవ్ర గాయాలపాలైనట్లు ఐరాస మానవ హక్కుల కమిషన్‌ వెల్లడించింది.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని