Ukraine: రహస్యంగా ‘ఆపరేషన్‌ క్రిమియా’

‘క్రిమియా రష్యన్లకు పవిత్ర స్థలం’.. ఈ మాట పుతిన్‌ నోటి నుంచి తరచూ వినిపిస్తుంటుంది. ఇటీవల క్రిమియాలోని రష్యా సైనిక స్థావరం పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఎనిమిది పేలుళ్లు జరిపారు.

Published : 19 Aug 2022 01:42 IST

 క్రిమియా పేలుళ్ల వెనుక కీవ్‌ హస్తం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘క్రిమియా రష్యన్లకు పవిత్ర స్థలం’.. ఈ మాట పుతిన్‌ నోటి నుంచి తరచూ వినిపిస్తుంటుంది. ఇటీవల క్రిమియాలోని రష్యా సైనిక స్థావరంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఎనిమిది పేలుళ్లు జరిపారు. ఈ సమయంలో క్రెమ్లిన్‌ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ దాడుల వెనుక కీవ్‌ హస్తం ఉన్నట్లు తేలితే వెంటనే అది ‘జడ్జిమెంట్‌ డే’ను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. అయినా క్రిమియాలో జరుగుతున్న  పేలుళ్లు మాత్రం ఆగడంలేదు. మంగళవారం కూడా రష్యా మందుగుండు డిపోలో భారీ పేలుళ్లు జరిగాయి. తాజాగా క్రిమియాలో ఉక్రెయిన్‌ రహస్య దళం ‘వెన్నుపోటు’ దాడులకు తెరతీసిన విషయానికి సంబంధించిన పత్రాలు ఓ అమెరికా పత్రిక చేతికి దక్కాయి.

జనవరిలోనే ఏర్పాట్లు..

రష్యా వద్ద ఉన్న సంప్రదాయ ఆయుధాల ధాటికి ఉక్రెయిన్‌ దళాలు ఏమాత్రం నిలవలేక పోతున్నాయన్నది వాస్తవం. వాటి వద్ద మందుగుండు, ఆయుధాలు కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. పశ్చిమ దేశాలు హామీ ఇచ్చిన ఆయుధాలు అందేందుకు సమయం పడుతుంది. ఈ లోపు రష్యా సామర్థ్యాలను దెబ్బతీయాలని ఉక్రెయిన్‌ వ్యూహ రచన చేసింది. రష్యా యుద్ధ నిల్వలు, ఆయుధ డిపోలు, కీలక సరఫరా లైన్లు, హెడ్‌క్వార్టర్లు, కమాండర్‌ క్వార్టర్లను దెబ్బతీసేందుకు యత్నాలు మొదలుపెట్టింది.

ఈ పరిస్థితిని ముందే ఊహించి.. ఉక్రెయిన్‌ ప్రత్యేక దళాల కమాండ్‌ పర్యవేక్షణలో జనవరిలోనే ఓ ‘ప్రతిఘటన దళం’ను ఏర్పాటు చేసింది. ఇందుకు అవసరమైన చట్టాన్ని గతేడాది చివర్లోనే ఉక్రెయిన్‌ ఆమోదించింది. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో ఉన్న దళ సభ్యులను కొన్ని వారాల క్రితమే యాక్టివేట్‌ చేసిందని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ వద్ద క్రిమియాలోని లక్ష్యాలను ఛేదించేంత దీర్ఘ శ్రేణి ఆయుధాలు లేకపోవడంతో ఈ వ్యూహం వైపు మొగ్గినట్లు సమాచారం. ఈ వ్యూహానికి ఉక్రెయిన్‌లో ‘డి-ఆక్యూపేషన్‌’గా పేరు పెట్టినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నాటో, మిత్రదేశాల శిక్షణ..

ఉక్రెయిన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో ఈ దాడులకు పాల్పడుతున్న దళాలకు పశ్చిమ దేశాల నుంచి శిక్షణ అందుతోంది. నాటో మిత్రదేశాలు ఉక్రెయిన్‌ సేనలకు రష్యా సరిహద్దులు అవతల ఏ విధంగా వ్యూహరచన చేసి దాడి చేయాలనే అంశాలను నేర్పిస్తోంది. డాన్‌బాస్‌ ప్రాంతంలో ప్రధాన ఆయుధంగా వాడుతున్న శతఘ్నులను దెబ్బతీసేలా మందుగుండు డిపోలు, గోదాములను పేల్చివేయడమే ఈ దళాల వ్యూహం. ఆపరేషనల్‌ సపోర్ట్‌ను దెబ్బతీస్తే రష్యా దళాలు తీవ్రంగా దెబ్బతింటాయని అంచనా వేస్తున్నారు.

ఇటీవల కాలంలో రష్యా ఆధీనంలోని క్రిమియాలో చోటు చేసుకొన్న భారీ పేలుళ్లు ఉక్రెయిన్‌ వ్యూహానికి అనుగుణంగానే జరిగాయి. ఆయుధ డిపోలు, ఎయిర్‌ఫోర్స్‌ బేసులు దెబ్బతిన్నాయి. కానీ, ఉక్రెయిన్‌ మంత్రి ఒలెక్సీ ఈ దాడులకు సంబంధించి బాధ్యత తీసుకోవడం లేదా తిరస్కరించడం వంటివి చేయకుండా తటస్థంగా ఉన్నారు.

రష్యా సేనలకు సప్లైలు అందకుండా చేయడమే..

ఈ యుద్ధం మొదలైన తొలి రోజు నుంచి రష్యా దళాలకు సరఫరాలను అందించే ప్రధాన స్థావరంగా  క్రిమియా నిలిచింది. దీంతోపాటు ఇక్కడి నుంచి ఉక్రెయిన్‌పైకి యుద్ధ విమానాలను పంపించింది. ఒడెస్సా సహా ఇతర నగరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్‌లోని సేనలకు ఇక్కడి ఆయుధాలు, ఆహారం వెళ్లాయి. ఆగస్టు మొదటి వరకు రష్యా సైన్యం క్రిమియాపై దాడులను ఊహించలేదు. క్రిమియా బీచ్‌లు కూడా జనాలతో కిక్కిరిసిపోయాయి. కానీ, క్రిమియాలో పేలుళ్లు మొదలైనప్పటి నుంచి టెన్షన్‌ పెరిగింది. ఒక్క ఆగస్టు 15 రోజునే కెర్చ్‌ వంతెనపై 38,297 కార్లు తిరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. చాలా మంది ప్రజలు క్రిమియాను వీడి వెళ్లిపోతున్నారు. 

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts