Ukraine Crisis: ‘రెండు లక్షలమందితో కొత్త బలగాలు.. మరోసారి కీవ్ ముట్టడికి రష్యా ప్లాన్‌..!’

తమ రాజధాని కీవ్‌ను ముట్టడించేందుకు రష్యా మరోసారి యత్నిస్తుందని ఉక్రెయిన్‌ సాయుధ దళాల కమాండర్- ఇన్- చీఫ్ జనరల్‌ వాలేరీ జాలుజ్నీ తెలిపారు. జనవరి నెలఖరులోనే ఇది జరగొచ్చని అంచనా వేశారు.

Published : 16 Dec 2022 11:22 IST

కీవ్‌: ఉక్రెయిన్‌(Ukraine)పై సైనిక చర్యలో భాగంగా మొదట్లో దేశ రాజధాని కీవ్‌(Kyiv)ను ముట్టడించేందుకు రష్యా విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ప్రారంభ నెలల్లో కీవ్‌ ముట్టడికి మరో భారీ ప్రయత్నం జరగొచ్చని ఉక్రెయిన్‌ అంచనా వేస్తోంది. దేశ సాయుధ దళాల కమాండర్- ఇన్- చీఫ్ జనరల్‌ వాలేరీ జాలుజ్నీ(Valeriy Zaluzhny) తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రస్తుతం చాలా వరకు యుద్ధం.. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. అయితే, రాజధానిని మరోసారి లక్ష్యం చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు బలగాలను సమీకరించడం, యుద్ధానికి సిద్ధమవడమే మా ముఖ్యమైన విధి’ అని తెలిపారు.

‘రష్యా ప్రస్తుతం దాదాపు రెండు లక్షల మందితో కొత్త బలగాలను సిద్ధం చేస్తోంది. కీవ్‌ ముట్టడికి మరోసారి యత్నిస్తుందనే విషయంపై ఎటువంటి సందేహం లేదు. మార్చి, ఫిబ్రవరి.. లేదా జనవరి నెలాఖరులోనే ఇది జరగొచ్చు. ఈ క్రమంలో.. మాస్కో సేనలను ఎదుర్కొనే విషయంలో లెక్కలు వేశాం. ఉక్రెయిన్‌కు 300 ట్యాంకులు, 600- 700 పదాతిదళ పోరాట వాహనాలు, 500 హోవిట్జర్లు అవసరం’ అని జాలుజ్నీ తెలిపారు. ఉక్రెయిన్‌ దక్షిణ భాగం నుంచి తూర్పుదిశగా విస్తరించి ఉన్న తమ సరిహద్దులను కాపాడుకోవడం ముఖ్యమైన సవాలు అని పేర్కొన్నారు.

‘యుద్ధభూమిలో వరుస అవమానకర ఓటముల క్రమంలో.. ఉక్రెయిన్‌ విద్యుత్‌ వ్యవస్థపై రష్యా దాడులకు పాల్పడుతోంది. ఎందుకంటే.. రాబోయే నెలల్లో భారీ దాడులకు వనరుల సేకరణ కోసం మాస్కో సేనలకు సమయం కావాలి’ అని చెప్పారు. క్షిపణులు, డ్రోన్ దాడుల ద్వారా పవర్ గ్రిడ్ విధ్వంసం సాధ్యమేనని చెబుతూ.. ఈ విషయంలో తాము ప్రస్తుతం పతనం అంచున ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. ఇదిలా ఉండగా.. రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్‌ విద్యుత్‌ నెట్‌వర్క్‌ ఇప్పటికే తీవ్రంగా ధ్వంసమైంది. విద్యుత్‌ అంతరాయాల కారణంగా లక్షలాది ఉక్రెనియన్లు అంధకారంలో చిక్కుకుపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని