Ukraine crisis: వేల సంఖ్యలో రష్యన్‌ సైనికుల దిగ్బంధం!

ఉక్రెయిన్‌(Ukraine)లో రష్యా బలగాలకు గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. దొనెట్స్క్‌ రీజియన్‌లోని లేమన్‌(Lyman) నగరాన్ని జెలెన్‌స్కీ సేనలు మళ్లీ చేజిక్కించుకున్నాయి. ఈ నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి...

Published : 02 Oct 2022 01:32 IST

‘లేమన్‌’ను పూర్తిగా చుట్టుముట్టిన ఉక్రెయిన్‌ బలగాలు

కీవ్‌: నాలుగు ప్రాంతాల విలీనం ప్రకటన వేళ... ఉక్రెయిన్‌(Ukraine)లో రష్యా బలగాలకు గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. దొనెట్స్క్‌ రీజియన్‌లోని లేమన్‌(Lyman) నగరాన్ని జెలెన్‌స్కీ సేనలు మళ్లీ చేజిక్కించుకున్నాయి. మాస్కో దళాల కీలక స్థావరంగా ఉన్న ఈ నగరాన్ని తాజాగా పూర్తిగా చుట్టుముట్టాయి. ‘లేమన్‌లో సుమారు 5,000 నుంచి 5,500 మంది రష్యన్‌ సైనికులు ఉన్నారు. అయితే.. ఉక్రెయిన్‌ సైన్యం చుట్టుముట్టిన క్రమంలో కొంతమంది ఇప్పటికే మృతి చెందడం, మరికొంతమంది పారిపోయేందుకు యత్నిస్తుండటంతో ఈ సంఖ్యలో కాస్త తేడా ఉండొచ్చు’ అని ఉక్రెయిన్ సైనిక ప్రతినిధి సెర్హి చెరెవాటి శనివారం వెల్లడించారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

ఉత్తర దొనెట్స్క్‌లో మిలిటరీ కార్యకలాపాల కోసం రష్యన్‌ బలగాలు లేమన్‌ను ‘లాజిస్టిక్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌గా’ వినియోగించాయి. ఈ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడాన్ని కీలక పరిణామంగా పేర్కొన్న చెరెవాటి.. దీంతో లుహాన్స్క్‌లోని క్రెమినా, సీవీరోదొనెట్స్క్‌ దిశగా మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం లభించిందన్నారు. డాన్‌బాస్‌ విముక్తికి ఇది మరో అడుగు అని చెప్పారు. దీంతోపాటు.. లేమన్‌ సమీపంలోని ఐదు స్థావరాలనూ తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా..  ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు పుతిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఉక్రెయిన్‌ సహా పాశ్చాత్య దేశాలు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని