Ukraine Crisis: జెలెన్‌స్కీ-పుతిన్‌ల భేటీ సాధ్యమే.. కానీ..!

ఉక్రెయిన్‌, రష్యా అధ్యక్షుల మధ్య సమావేశం సాధ్యమేనని రష్యా అధ్యక్ష భవనం పేర్కొంది. కానీ, ఇందుకు ముందస్తు సన్నద్ధత అవసరమని అభిప్రాయపడింది.

Published : 02 Jun 2022 01:44 IST

అమెరికా తీరు అగ్రదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీయొచ్చన్న రష్యా

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దండయాత్ర మూడు నెలలైనా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నప్పటికీ రష్యా బలగాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌, రష్యా అధ్యక్షుల మధ్య సమావేశం సాధ్యమేనని రష్యా అధ్యక్ష భవనం పేర్కొంది. కానీ, ఇందుకు ముందస్తు సన్నద్ధత అవసరమని అభిప్రాయపడింది. ఇక ఉక్రెయిన్‌కు అత్యాధునిక రాకెట్లను అందజేస్తామని అమెరికా ప్రకటించడాన్ని తప్పుపట్టిన రష్యా.. ఇటువంటి చర్యలు రెండు అగ్రదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీస్తాయని హెచ్చరించింది.

వారి భవిష్యత్తు వారి చేతుల్లోనే..

ఉక్రెయిన్‌ శాంతి ఒప్పందానికి సంబంధించిన కార్యాచరణ చాలా రోజుల కిందటే నిలిచిపోయిందని.. మళ్లీ దానిని ప్రారంభించలేదని రష్యా అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు. ఖెర్సన్‌, ఝపోరిజియా, డాన్బాస్‌ ప్రాంతంలోని ప్రజలు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలన్న ఆయన.. వారు సరైన నిర్ణయం తీసుకుంటారనడంలో రష్యాకు ఎటువంటి అనుమానాలూ లేవని అన్నారు. ఈ మూడు ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకోవడం వల్ల ఇరు పక్షాల మధ్య శాంతి చర్చలు ముగిసిపోతాయని ఉక్రెయిన్‌ గతంలో చెప్పిందని మీడియాతో మాట్లాడిన సందర్భంలో గుర్తుచేశారు.

అగ్రదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణే..

ఉక్రెయిన్‌కు అధునాతన రాకెట్‌ వ్యవస్థలు, యుద్ధ సామగ్రిని అందజేస్తామని అమెరికా చేసిన ప్రకటనను రష్యా తీవ్రంగా తప్పుపట్టింది. ఈ రకమైన చర్యల వల్ల రెండు అగ్రదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సాయం చేయడాన్ని రష్యా తీవ్ర ప్రతికూల అంశంగానే పరిగణిస్తామని క్రెమ్లిన్‌ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉక్రెయిన్‌ విషయంలో ఓ పరిష్కారం కనుక్కోవడంలో అమెరికా ఏమీ చేయడం లేదని.. సైనిక చర్యకంటే ముందు చాలా ఏళ్లుగా ఇదే విధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని