Ukraine Crisis: దాడులు ముమ్మరం

ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా సైనిక బలగాలు గురువారం ఎడాపెడా బాంబులు, క్షిపణుల వర్షం కురిపించాయి. తూర్పు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. డాన్‌బాస్‌ ప్రాంతంలోని పలు ప్రాంతాలపై రష్యా పెద్దఎత్తున దాడులు జరిపిందని

Published : 29 Apr 2022 05:59 IST

ఎడాపెడా బాంబుల వర్షం
కుళ్లుతున్న మృతదేహాలతో ఆరోగ్య సమస్యలు
జెలెన్‌స్కీతో ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌ భేటీ  
యుద్ధ నేరాలపై దర్యాప్తు జరిపిస్తామని హామీ


21వ శతాబ్దంలో యుద్ధం అర్థం లేనిది. అది ఆమోద యోగ్యం కాదు. యుద్ధ నేరాలపై విచారణ జరపడం చాలా ముఖ్యం. నేరాల్లో హీనమైనది యుద్ధమే. ఎక్కడ యుద్ధం జరిగినా ఎక్కువగా మూల్యం చెల్లించుకునేది సాధారణ పౌరులే.

-ఆంటోనియో గుటెరస్‌


కీవ్‌: ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా సైనిక బలగాలు గురువారం ఎడాపెడా బాంబులు, క్షిపణుల వర్షం కురిపించాయి. తూర్పు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. డాన్‌బాస్‌ ప్రాంతంలోని పలు ప్రాంతాలపై రష్యా పెద్దఎత్తున దాడులు జరిపిందని ఉక్రెయిన్‌ తెలిపింది. బాంబుదాడుల వల్ల కొత్తగా మేరియుపొల్‌లో అనేక ప్రాంతాల్లో నష్టం వాటిల్లినట్లు ఉపగ్రహ చిత్రాలు కూడా తెలిపాయి. చాలా మృతదేహాలకు ఇంకా అంత్యక్రియలు నిర్వహించలేకపోవడం వల్ల అవి కుళ్లిపోయి, పారిశుద్ధ్యం పరంగా ప్రమాదకర స్థితిలో అనేకమంది పౌరులు ఉన్నారని ఉక్రెయిన్‌ వర్గాలు పేర్కొన్నాయి. తాగునీరు, ఆహారం తగినంత దొరక్క అనారోగ్య సమస్యలు తలెత్తనున్నాయని తెలిపాయి.

దాడుల్ని తిప్పికొట్టాం: ఉక్రెయిన్‌
డాన్‌బాస్‌లో ఆరుచోట్ల రష్యా సైనికులు దాడులకు పాల్పడగా వాటన్నింటినీ తిప్పికొట్టామని ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు తెలిపాయి. దొనెట్స్క్‌, ఖర్కివ్‌ల వద్ద కూడా ఉభయపక్షాల మధ్య గట్టి పోరు కొనసాగింది. ఈ రెండుచోట్ల నివాస ప్రాంతాలపైనా రష్యా సైనికులు దాడులకు దిగారు. పదేపదే చేస్తున్న దాడులతో అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారం చాలావరకు దెబ్బతిన్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు చెబుతున్నాయి.

నా కుటుంబమే ఇక్కడ ఉంటే..
బుచా వంటి నగరాల్లో ఇటీవల చోటు చేసుకున్న అకృత్యాలను ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఖండించారు. అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ)లో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యుల్ని చట్టం ముందు నిలబెట్టాలన్న డిమాండ్లకు మద్దతు పలికారు. ఈ విషయంలో రష్యా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కీవ్‌ వెలుపల వేర్వేరు పట్టణాల్లో వాటిల్లిన నష్టాన్ని ఆయన పరిశీలించారు. ‘‘ఇళ్లపై బాంబులు పడుతుంటే నా సొంత కుటుంబమే ఇక్కడి నుంచి తరలిపోవాల్సి వచ్చిందని నేను ఊహించుకుంటున్నాను. ధ్వంసమైన భవనాలు చూస్తుంటే వాటిలో నా కుటుంబం ఉంటే ఎలా ఉంటుందా అని అనుకున్నాను. భయంతో నా మనవరాళ్లు పరుగులు తీస్తున్నట్లు అనిపించింది’’ అని అన్నారు. విచారణకు రష్యా అంగీకరించి, సహకరించాలని కోరారు.  జెలెన్‌స్కీతో గుటెరస్‌ భేటీ ముగిసిన కాసేపటికే కీవ్‌లో కనీసం రెండు పేలుళ్లు సంభవించాయి.  గుటెరస్‌, ఆయన బృందం సురక్షితంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ఖేర్సన్‌లో రెఫరెండం!
ఖేర్సన్‌ నగరాన్ని మాస్కో అనుకూల రిపబ్లిక్‌గా రష్యా ప్రకటిస్తుందేమోనని అక్కడి ప్రజలు అనుమానిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) పేరుతో ఇలా చేయవచ్చనే ఆందోళనలో వారు ఉన్నారు. ఈ ప్రాంతంలో సైనికులు ఎవరిపైనా కాల్పులు జరపడం లేదు. ఇతరత్రా ఘోరాలకు పాల్పడడం లేదు. అయితే బయటి ప్రాంతాలతో సంబంధాలు లేవు. ఉక్రెయిన్‌ ఛానళ్లకు బదులు రష్యా ఛానళ్లు మాత్రమే వస్తున్నాయి. కర్ఫ్యూ అమల్లో ఉంటోంది.

ఇది ఉక్రెయిన్‌ సమస్యగా వదిలిపెట్టలేం: బల్గేరియా
ఇంతవరకు ఉక్రెయిన్‌కు 800 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని నాటో అందించిందని ఆ కూటమి అధిపతి స్టోల్తెన్‌బర్గ్‌ తెలిపారు. ఉక్రెయిన్‌కు సాయపడడంలో తమవంతు చేయూత అందిస్తామని బల్గేరియా ప్రధాని కిరిల్‌ పెట్‌కోవ్‌ ప్రకటించారు. యుద్ధాన్ని ఉక్రెయిన్‌ సమస్యగా వదిలిపెట్టేయలేమని చెప్పారు. కీవ్‌ నగరం వెలుపల యుద్ధ నష్టాన్ని ఆయన పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని