Ukraine Cholera: ఉక్రెయిన్‌కు కొత్త సంకటం.. కలవరపెడుతున్న కలరా!

దాదాపు నాలుగు నెలలుగా రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌కు మరో కొత్త సంకటం వచ్చి పడింది....

Published : 13 Jun 2022 01:10 IST

కీవ్‌: దాదాపు నాలుగు నెలలుగా రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌కు మరో కొత్త సంకటం వచ్చి పడింది. పేరుకుపోయిన చెత్త, కుళ్లిన శవాలు, కలుషిత నీరు వాటి చుట్టూ ముసురుతున్న కీటకాలు ఇప్పుడు అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రష్యా బాంబులతో అట్టుడుకిపోయిన మరియుపోల్‌, ఖేర్సన్‌ వంటి నగరాల్లో ఎక్కడ చూసినా శవాలే దర్శనమిస్తున్నాయి. దీంతో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు ‘కలరా వ్యాధి’కి దారితీస్తున్నాయి. ఇప్పటికే పలు కేసులను గుర్తించినట్లు మరియుపోల్‌ గవర్నర్‌ ధ్రువీకరించారు. మూడు నెలల నిరంతర దాడుల తర్వాత రష్యా ఈ నగరాన్ని మే నెలలో తమ గుప్పిట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే.

కుళ్లుతున్న శవాల చుట్టూ ముసురుతున్న ఈగలు, బొద్దింకల వంటి కీటకాలు కలరా వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రానురానూ ఈ వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చి రోజుల వ్యవధిలో వేల మందిని పొట్టనబెట్టుకునే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రష్యా దాడుల్లో సొంతవారిని కోల్పోయి నిరాశ్రయులుగా మారిన అనేక మందికి కలరా రూపంలో మరో ప్రమాదం పొంచి ఉండడం పట్ల ఐక్యరాజ్య సమితి సైతం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

గత నెల రోజులుగా పలు కలరా కేసుల్ని గుర్తించినట్లు ఉక్రెయిన్‌ నియమించిన మరియుపోల్‌ గవర్నర్‌ తెలిపారు. మరిన్ని అంటువ్యాధులు కూడా ప్రబలుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రష్యా నియమించిన గవర్నర్‌ వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఒక్క కలరా కేసు కూడా వెలుగులోకి రాలేదని తెలిపారు. అయితే, రష్యా గుప్పిట్లో ఉన్న ఈ నగరం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని ఉక్రెయిన్‌ ఆరోగ్య శాఖ తెలిపింది.

దాదాపు మూడు నెలల పాటు జరిపిన దాడుల్లో ఏప్రిల్‌ నాటికే మరియుపోల్‌లో 10వేల మంది మరణించినట్లు అంచనా. ఆ తర్వాత కూడా కొన్ని వారాల పాటు యుద్ధం కొనసాగిన నేపథ్యంలో మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఉక్రెయిన్‌ వర్గాలు చెబుతున్నాయి. మరియుపోల్‌లో తాగునీటిలో మురుగునీరు చేరుతోందని.. ఇది కలరా సహా ఇతర అంటువ్యాధులకు దారితీసే అవకాశం ఉందని ఇటీవల ఐరాస, రెడ్‌క్రాస్‌ హెచ్చరించాయి. మరోవైపు ఔషధాల కొరత కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు కూడా అందుబాటులో లేరని మరియుపోల్‌ నగర స్థానికులు తెలిపారు. రష్యన్‌ అధికారులు 80 ఏళ్లు పైబడిన రిటైర్డ్‌ డాక్టర్లను నియమిస్తున్నారని పేర్కొన్నారు.

కలరా చాలా తీవ్రమైనది. సకాలంలో చికిత్స అందకపోతే ఈ జబ్బు కొన్ని గంటల్లోనే మరణానికి దారితీస్తుంది. ఇది ‘విబ్రియో కలరే’ అనే బాక్టీరియా వల్ల వస్తుంది. దీనితో కలుషితమైన ఆహారం తినడం లేదా నీరు తాగడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అపరిశుభ్ర వాతావరణం, కలుషిత తాగునీటిలో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గతంలో ఈ వ్యాధి తీవ్ర మానవతా సంక్షోభాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా నగరాల్లో శానిటేషన్‌ సరిగా జరగడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే.. మరియుపోల్‌ సహా ఇతర ప్రాంతాలనూ ఈ అంటువ్యాధుల సమస్య చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని