Ukraine Crisis: పుతిన్‌కు మీరైనా చెప్పండి.. భారత్‌కు ఉక్రెయిన్‌ విజ్ఞప్తి

రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా వివిధ దేశాలను కోరారు. అలాగే తమ దేశంపై చేస్తున్న సైనిక చర్యను ఆపేలా రష్యాను కోరాలని భారత్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు...

Published : 06 Mar 2022 14:03 IST

కీవ్‌: రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా వివిధ దేశాలను కోరారు. అలాగే తమ దేశంపై చేస్తున్న సైనిక చర్యను ఆపేలా రష్యాను కోరాలని భారత్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

రష్యా దాడులు రోజురోజుకీ భీకరంగా మారుతున్న నేపథ్యంలో శనివారం కులేబా జాతినుద్దేశించి ప్రసంగించారు. రష్యా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. సామాన్య పౌరులు సహా విదేశీయులు దేశం నుంచి వెళ్లిపోయేందుకు వీలుగా కాల్పులను ఆపాలని కోరారు. ‘‘30 ఏళ్లుగా ఆఫ్రికా, ఆసియా సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులను స్వాగతించాం. ఇప్పుడు వారు తరలివెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఉక్రెయిన్‌ ప్రభుత్వం దానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటోంది. కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీ విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఆయా దేశాల సానుభూతిని పొందాలని చూస్తోంది. పౌరులు సురక్షితంగా ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు కాల్పులు ఆపేలా రష్యాను కోరాలని ఇండియా, చైనా, నైజీరియా దేశాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కులేబా అన్నారు. 

‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేక సంబంధాలున్న భారత్‌ సహా ఇతర దేశాలు ఈ యుద్ధాన్ని ఆపేలా వారికి నచ్చజెప్పాలి. ఈ పరిణామాలు అన్ని దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని వివరించాలి. ఉక్రెయిన్‌ వ్యవసాయోత్పత్తుల అతిపెద్ద వినియోగదారుగా భారత్‌ కొనసాగుతోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే పంటలు పండించడం కష్టంగా మారుతుంది. ఆ రకంగా చూసినా ప్రపంచ, భారత్‌ ఆహార భద్రతకు యుద్ధాన్ని ఆపడమే శ్రేయస్కరం’’ అని కులేబా వ్యాఖ్యానించారు. 

ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తరలించేందుకు భారత్‌ ‘ఆపరేషన్‌ గంగ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. భారత వాయుసేన సహా వివిధ విమానయాన సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ఈ ఆపరేషన్‌ ద్వారా 13,300 మంది భారత్‌కు చేరుకున్నారు. ప్రతిఒక్కరినీ భారత్‌ చేర్చే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని