Zelenskyy: ‘పుతిన్‌.. టాయిలెట్‌ కోసం బకెట్‌ పట్టుకొని..’!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin).. తన శేష జీవితాన్ని బంకర్‌లో గడుపుతారని ఆశిస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) పేర్కొన్నారు.  రష్యా బలగాల చేతిలో బందీగా మారి.. నెల రోజుల పాటు బంకర్‌లో గడిపిన గ్రామంలో ఆయన పర్యటించారు.

Published : 04 Apr 2023 00:06 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేస్తోన్న రష్యా.. అనేక దారుణాలకు పాల్పడుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. రష్యా సైనికుల అకృత్యాలతో అనేక గ్రామాల ప్రజలు కొన్నిరోజుల పాటు బంకర్లలతో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా తన శేష జీవితాన్ని నేలమాళిగలోనే గడపాలని తాను ఆశిస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అందులోనూ టాయిలెట్‌ కోసం బకెట్‌ పట్టుకొని తన జీవితాన్ని గడుపుతాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రష్యా దురాక్రమణ మొదలుపెట్టిన సమయంలో యాగిద్నే ప్రాంతం వార్తల్లో నిలిచింది. రష్యా సైనికులు చర్యలతో ఒకే గ్రామానికి చెందిన 367 మంది పౌరులు అక్కడి పాఠశాల బంకర్‌లో బందీలుగా మారారు. కేవలం 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ గదిలో సుమారు నెలపాటు దాక్కున్నారు. ఆ ప్రతికూల పరిస్థితులకు తట్టుకోలేక 11 మంది అదే గదిలో ప్రాణాలు విడిచారు. తాజాగా ఈ ప్రాంతంలో పర్యటించిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అక్కడి పరిసరాలు, గ్రామ ప్రజలు పడిన నరకయాతన తెలుసుకొని చూసి చలించిపోయారు.

అనంతరం స్పందించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ‘ఇవన్నీ చూసిన తర్వాత, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ టాయిలెట్‌ కోసం ఓ బకెట్‌ పట్టుకొని తన శేష జీవితం కూడా ఓ బంకర్‌లోనే గడుపుతారని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని మరచిపోకుండా ఉండేందుకు గ్రామస్థులు వారి పేర్లు నమోదు చేయడం, పిల్లలు జాతీయగీతాన్ని రాసిన తీరును జెలెన్‌స్కీ ప్రశంసించారు. రష్యన్‌ దళాల నుంచి విముక్తి పొంది ఏడాదైన సందర్భంగా యాగిద్నే ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీతోపాటు జర్మన్‌ వైస్‌ ఛాన్సలర్‌ రాబర్ట్‌ హెబెక్‌ పర్యటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని