ఉక్రెయిన్‌-రష్యా: రెండో విడత శాంతి చర్చలు ప్రారంభం..!

ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతోన్న సమయంలో రెండో విడత శాంతి చర్చలకు ఇరుదేశాలు సిద్ధమయ్యాయి.

Published : 03 Mar 2022 20:54 IST

కీవ్‌: ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతున్న సమయంలో రెండో విడత శాంతి చర్చలను ఇరుదేశాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా బెలారస్‌-పోలండ్‌ సరిహద్దు ప్రాంతం వేదికగా మారింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవిస్తున్న వేళ.. ఇరు దేశాలు పోరుకు ముగింపు పలుకుతాయా అనే అంశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రస్తుత యుద్ధ పరిస్థితులను ముగించడంతోపాటు డాన్‌బాస్‌లో శాంతిని పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు రష్యా విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఉక్రెయిన్‌లోని ప్రజలందరూ శాంతియుత జీవనానికి తిరిగి రావడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నట్లు చెప్పింది.

అంతకుముందు ఉక్రెయిన్‌ బృందంలోని సభ్యుడైన స్థానిక ప్రజాప్రతినిధి డేవిడ్ అరాఖమియా మాట్లాడుతూ.. చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌లో మానవతా సహాయ చర్యల కోసం ‘హ్యూమానిటేరియన్‌ కారిడార్‌’ల ఏర్పాటుపై ఒప్పందం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. మరోవైపు చర్చలు జరిగినప్పటికీ తమ దాడులను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌ నిస్సైనీకరణే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేసింది.

అప్పటివరకు వెనక్కి తగ్గం: పుతిన్‌

ఉక్రెయిన్‌పై చేపడుతున్న సైనిక చర్య విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్‌ డిమిలిటరైజేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరతామని.. ఇదే విషయాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌కు స్పష్టం చేసినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఉక్రెయిన్‌ చర్చలను ఆలస్యం చేసే కొద్దీ మరిన్ని డిమాండ్లు తెరమీదికి తీసుకొస్తామని పుతిన్ అన్నట్లు వెల్లడించింది. సైనిక చర్యను ఆపాలని కోరుతూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌, రష్యా అధ్యక్షుడితో దాదాపు గంటకుపైగా ఫోన్‌లో మాట్లాడారు. అయినప్పటికీ పుతిన్‌ వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌లో ఊహించని పరిస్థితులు ఎదురుకావచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని