Ukraine Crisis: రష్యాను ఆ ద్వీపమే పామై కాటేస్తోంది..!

ఉక్రెయిన్‌పై దాడి మొదలుపెట్టిన తొలి రోజే రష్యా దళాలు స్నేక్‌ ఐలాండ్‌ అనే దీవిని చుట్టుముట్టాయి. దీనిలోని సైనికులను అదుపులోకి తీసుకొన్నాయి. అప్పట్లో మాస్కోవా నౌక ఈ దాడిలో కీలక పాత్ర పోషించింది. ఉక్రెయిన్‌ నుంచి తేలిగ్గా ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకొన్న ఆనందరం రష్యాకు మూడు నెలలు కూడా నిలవలేదు. ఈ ద్వీపం రష్యా నావికాద

Published : 09 May 2022 02:03 IST

 స్నేక్‌ ఐలాండ్‌ వద్ద కీలక నౌకలపై దాడులు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఒక చిన్నదీవి రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి మొదలుపెట్టిన తొలి రోజే రష్యా దళాలు స్నేక్‌ ఐలాండ్‌ను  చుట్టుముట్టాయి. ఇక్కడి సైనికులను అదుపులోకి తీసుకొన్నాయి. అప్పట్లో మాస్కోవా నౌక ఈ దాడిలో కీలక పాత్ర పోషించింది. ఉక్రెయిన్‌ నుంచి తేలిగ్గా ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకొన్న ఆనందం రష్యాకు మూడు నెలలు కూడా నిలవలేదు. ఇది రష్యా నావికాదళానికి మృత్యు దీవిగా మారింది. రష్యా ఆధీనంలోకి తీసుకున్న ఈ చిట్టి ద్వీపం ఇప్పుడు మింగుడు పడటంలేదు. ఈ ద్వీపాన్ని ఆధీనంలోకి తీసుకొన్న నౌకతో సహా ఇప్పటి వరకు రష్యాకు చెందిన మూడుకుపైగా చిన్నా,పెద్దా నౌకలు మునిగిపోయాయి. మృతుల సంఖ్య కూడా భారీగా ఉంది. నల్లసముద్రంలో ఈ వ్యూహాత్మక ద్వీపాన్ని ఆధీనంలో ఉంచుకోవడం రష్యాకు తలకు మించిన భారంగా మారుతోంది. మరోపక్క ఈ ద్వీపం వదులుకొన్న ఉక్రెయిన్‌ మాత్రం రష్యాకు దానిని దక్కనీయడంలేదు. తాజాగా రష్యాకు చెందిన మరో భారీ నౌకను ఈ ద్వీపం వద్ద ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ట్విటర్‌లో వీడియోతో సహా విడుదల చేసింది.

తాజాగా ఏం జరిగింది..?

రష్యాకు చెందిన ఒక ల్యాండింగ్‌ షిప్‌ను స్నేక్‌ ఐలాండ్‌ వద్ద ఉక్రెయిన్‌కు చెందిన బైరక్తర్‌ టీబీ-2 డ్రోన్లు ధ్వంసం చేశాయి. రష్యా నావికాదళం  సైనికులను, సాయుధ సామగ్రని చేరవేయడానికి ఈ ల్యాండింగ్‌ షిప్‌ను వినియోగిస్తోంది. తాజాగా రష్యా యుద్ధనౌకపై దాడి వీడియోను ఉక్రెయిన్‌ షేర్‌ చేసింది. అంతేకాదు స్నేక్‌ ఐలాండ్‌పై ఉన్న ఒక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను కూడా తమ డ్రోన్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

దాడి జరిగిన ప్రదేశాల్లో ఉపగ్రహ చిత్రాలను ఆదివారం ఉదయం ప్లానెట్‌ ల్యాబ్‌ అనే ప్రైవేటు సంస్థ సేకరించి విశ్లేషించింది. ఈ దాడిలో ధ్వంసమైన నౌకను రష్యాకు చెందిన సెర్నా క్లాస్‌ ల్యాండింగ్‌ షిప్‌గా గుర్తించింది. రష్యా విక్టరీ డే సంబరాలు చేసుకోవడానికి కొద్ది గంటల ముందే ఈ దాడులు జరగడం గమనార్హం.

శత్రుసేనలకు శ్మశానంలా ఈ ద్వీపం..!

మొత్తం పావు చదరపు కిలోమీటరు వైశాల్యంతో ఉన్న ఈ ద్వీపం నల్ల సముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రదేశం. ఇది సముద్రమట్టం కంటే 41 మీటర్లు ఎత్తులో ఉంటుంది. ఉక్రెయిన్‌ ఆర్థిక కేంద్రమైన ఒడెస్సా పోర్టుకు 80 మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ ద్వీపంపై పట్టు సాధించిన దేశం నల్ల సముద్రంలో నౌకల కదలికలపై నిఘా పెట్టే సామర్థ్యాన్ని దక్కించుకొంటోంది. మూడు శతాబ్దాలుగా ఇది రష్యా, టర్కీ, రొమేనియా, ఉక్రెయిన్‌ల చేతుల్లోకి వెళ్లింది. తాజాగా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తొలి రోజే రష్యా దళాలు ఈ ద్వీపాన్ని చుట్టుముట్టాయి. మాస్కోవా యద్ధ నౌక రంగంలోకి దిగి.. ఈ ద్వీపంపై క్రూజ్‌ క్షిపణుల వర్షం కురిపించింది. దీనిపై కట్టడాలు, లైట్‌హౌస్‌ను కూల్చివేసింది. రష్యా స్వాధీనం చేసుకొన్న అనంతరం .. అక్కడ ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ పరికరాలు, సెన్సర్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. 

ఏప్రిల్‌ 13న మాస్కోవా నౌక స్నేక్‌ ఐలాండ్‌ సమీపంలో ప్రయాణిస్తుండగా.. రెండు నెప్ట్యూన్‌ క్షిపణులు దానిని ధ్వంసం చేశాయి. ఆ మర్నాడే దెబ్బతిన్న నౌకను క్రిమియాలోని సెవస్టపోల్‌కు తరలిస్తుండగా మునిగిపోయింది. వాస్తవానికి అమెరికా ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్లను ధ్వంసం చేసేలా ఈ మాస్కోవా నౌకను రష్యా తయారు చేసింది. అలాంటి నౌకను కోల్పోవడం రష్యాకు భారీ ఎదురుదెబ్బ. 

ఏప్రిల్‌ 26న ఈ ద్వీపంపై ఉన్న స్టెర్లా -10 క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్‌ బైరక్తర్‌ డ్రోన్‌ ధ్వంసం చేసింది. ఏప్రిల్‌ 30 మరో స్టెర్లను పేల్చేసింది. మే 2వ తేదీని మరోసారి బైరక్తర్లు ఇక్కడ దాడి చేశాయి. ఈ దాడిలో రష్యాకు చెందిన రెండు రాప్టర్‌ శ్రేణి బోట్లను ముంచేశాయి. తాజాగా మరోసారి దాడి చేసి భారీ యుద్ధనౌకను ధ్వంసం చేసింది. 

అక్లిస్‌ సమాధి అక్కడే..

గ్రీక్‌పురాణాల్లో ప్రస్తావించే యోధుడు అక్లిస్‌ సమాధి ఈ ద్వీపంలోనే ఉందని నమ్ముతారు. ఇక్కడ అక్లిస్ పేరిట ఆలయం కూడా ఉందని చెబుతారు. 1788 జులై 14న తొలిసారి రష్యాకు చెందిన బ్లాక్‌సీ దళం ఈ ద్వీపం కోసం  టర్కీ చక్రవర్తి సేనలతో యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ తర్వాత 19వ శతాబ్దంలో పలు మార్లు మాస్కో-ఇస్తాంబుల్‌ చేతులు మారింది. కొన్నాళ్లు రొమేనియా చేతిలోకి వెళ్లింది. అప్పుడే ఇక్కడ అక్లిస్‌ మందిర శిథిలాలపై లైట్‌ హౌస్‌ నిర్మించినట్లు చెబుతారు. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఈ ద్వీపంపై దాడి చేసింది.  రెండో ప్రపంచ యద్ధంలో ఈ ద్వీపం కోసం సోవియట్‌-రొమేనియా మధ్య పోరు జరిగింది. ఆ సమయంలో రొమేనియా దళాలు భారీగా సీమైన్లను ఏర్పాటు చేశాయి. 1942 సమయంలో సొవియట్‌  సబ్‌మెరైన్లు కూడా ఇక్కడ మునిగిపోయాయి. 1944లో రొమేనియా ఈ ద్వీపాన్ని వదులుకోగా.. సోవియట్‌ సేనలు ఆధీనంలోకి తీసుకొన్నాయి. ఇక్కడ రాడార్‌ స్టేషన్లతో సహా పలు కట్టడాలు నిర్మించాయి. 1991 తర్వాత సోవియట్‌ పతనంతో ఇది ఉక్రెయిన్‌కు లభించింది.  ఇప్పుడు మళ్లీ ఈ పావుకిలోమీటరు ద్వీపం స్వాధీనం చేసుకొనేందుకు మాస్కో భారీ నష్టాలను సైతం లెక్కచేయడంలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు