Ukraine Crisis: రష్యా ట్యాంకులకు ఆ నదే లక్ష్మణ రేఖా..?

రష్యా దళాల  ప్లానింగ్‌ ఉక్రెయిన్‌ యుద్ధంలో అత్యంత దారుణంగా ఉంది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా మాస్కో వ్యూహకర్తల్లో చలనం రావడంలేదు. తాజా ఉక్రెయిన్‌ దళాలు

Published : 13 May 2022 11:54 IST

ఒకే చోట పదుల సంఖ్యలో వాహనాలను పేల్చేసిన ఉక్రెయిన్‌ దళాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా దళాల ప్లానింగ్‌ ఉక్రెయిన్‌ యుద్ధంలో అత్యంత దారుణంగా ఉంది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా మాస్కో వ్యూహకర్తల్లో చలనం రావడంలేదు. తాజాగా ఉక్రెయిన్‌ దళాలు ఒకే చోట 52 రష్యా సాయుధ వాహనాలను ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ట్విటర్‌ హ్యాండిల్‌లో ఉంచింది. ‘‘ఉక్రెయిన్‌కు చెందిన 17 ట్యాంక్‌ బ్రిగేడ్‌లోని శతఘ్ని దళాలు సెలవులు ఇవ్వడం మొదలుపెట్టాయి. కొందరు సివెర్స్కి డొనెట్స్‌ నదిలో స్నానం చేస్తుండగా.. మరికొందరు మే నెల సూర్యుడి దెబ్బకు కాలిపోతున్నారు’’ అని వెటకారంగా ట్వీట్‌ చేసింది. ఉక్రెయిన్‌ దళాలు చాకచక్యంగా పనిచేస్తూ.. రష్యన్లను ముందుకు కదలనీయకుండా చేస్తున్నాయి. 

సివెర్స్కి డొనెట్స్‌ నదిని దాటేందుకు ఉన్న పాంటూన్‌ బ్రిడ్జిపై ఉక్రెయిన్‌ దళాలు దాడి చేసి కూల్చేశాయి. అదే సమయంలో ఆ కాన్వాయ్‌లో ఉన్న మిగిలిన వాహనాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేసినట్లు అర్థమవుతుంది. దీనికి ఉక్రెయిన్‌ జీపీఎస్‌ గైడెడ్‌ శతఘ్ని గుండ్లను వినియోగించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ దాడిలో రష్యా సైన్యానికి చెందిన చాలా వాహనాలు దెబ్బతిన్నాయని సైనిక నిపుణుడు రాబ్‌ లీ పేర్కొన్నారు. రష్యా టాక్టికల్‌ బెటాలియన్‌ గ్రూపులను కనీసం 10 ట్యాంకులు, 40 సాయుధ రక్షణ వాహనాలు, దాదాపు 900 మంది సిబ్బందితో కలిపి రూపొందిస్తారని అన్నారు. ఉక్రెయిన్‌ విడుదల చేసిన చిత్రాలను వాణిజ్య శ్రేణి డ్రోన్‌తో చిత్రీకరించినట్లు భావిస్తున్నారు. 

సివెర్స్కి డొనెట్స్‌ నది దక్షిణ రష్యా నుంచి ఉక్రెయిన్‌ వేర్పాటు వాద ప్రాంతాలైన ఖర్ఖీవ్‌, లుహాన్స్క్‌ వరకు ప్రవహిస్తుంది. ఇది రష్యా దళాలకు భారీ అడ్డంకిగా మారింది. మాస్కో దళాలు ఈ  నది కుడివైపు ఒడ్డున ఉన్న రుబిఝన్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి విఫలయత్నం చేస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని