Ukraine Crisis: సీవీరోడొనెట్స్క్‌లో హోరాహోరి.. రష్యా సర్వశక్తులొడ్డుతోందన్న ఉక్రెయిన్‌

వ్యూహాత్మక సీవీరోడొనెట్స్క్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సర్వశక్తులు ఒడ్డుతున్నప్పటికీ.. తమ సేనలు వారిని వెనక్కి నెట్టాయని ఉక్రెయిన్ శనివారం తెలిపింది. లుహాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ సెర్గి గైదే ఈ విషయమై మాట్లాడుతూ...

Published : 05 Jun 2022 02:23 IST

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక నగరమైన ‘సీవీరోడొనెట్స్క్‌’ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సర్వశక్తులు ఒడ్డుతున్నప్పటికీ.. తమ సేనలు వారిని వెనక్కి నెట్టాయని ఉక్రెయిన్ శనివారం తెలిపింది. లుహాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ సెర్గి గైదే ఈ విషయమై మాట్లాడుతూ.. ‘మాస్కో సేనలు నగరంలో చాలా భాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అయినప్పటికీ.. తమ దళాలు వారిని దీటుగా నిలువరిస్తున్నాయి. ఈ క్రమంలోనే నగరంలో అయిదో వంతును తిరిగి నియంత్రణలోకి తెచ్చుకున్నాయి’ అని వెల్లడించారు. లుహాన్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ చేతుల్లో ఉన్న ఈ అతిపెద్ద నగరంలో రష్యా దళాలు క్రమంగా పురోగమిస్తున్న విషయం తెలిసిందే.

సీవీరోడొనెట్స్క్ జంట నగరమైన లిసిచాన్స్క్‌లో పరిస్థితి మరింత భయంకరంగా ఉందని స్థానిక మేయర్‌ ఒలెక్సాండర్‌ జైకా తెలిపారు. దాదాపు 60 శాతం మౌలిక సదుపాయాలు, గృహాలు ధ్వంసమయ్యాయని.. ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్‌, గ్యాస్ సేవలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. మరోవైపు.. సీవీరోడొనెట్స్క్‌కు 80 కి.మీల దూరంలో ఉన్న స్లోవియన్స్క్ నగరంలోనూ నీరు, విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. బాంబు దాడులు జరిగే అవకాశం ఉన్నందున పౌరులు నగరాన్ని ఖాళీ చేయాలని అధికారులు కోరారు.

ఇదిలా ఉండగా.. రష్యన్ దళాలతో పోరాడుతోన్న విదేశీ సైనిక వాలంటీర్లలో తాజాగా నలుగురు మృతి చెందినట్లు ఉక్రెయిన్ శనివారం ప్రకటించింది. వీరు జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌లకు చెందినవారని చెప్పింది. అయితే ఎప్పుడు? ఏ పరిస్థితుల్లో మరణించారో వెల్లడించలేదు. లుహాన్స్క్‌ రీజియన్‌లోనూ నలుగురు పౌరులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. ఒడెస్సా రీజియన్‌ డాచ్నే గ్రామంలోని విదేశీ కిరాయి సైనికుల కేంద్రంతోపాటు సుమీ ప్రాంతంలో ఉక్రెయిన్‌ బలగాలు శిక్షణ పొందుతున్న స్థావరంపై క్షిపణి దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు