Published : 17 May 2022 12:07 IST

Ukraine Crisis: మేరియుపోల్‌ ఉక్కుకర్మాగారం నుంచి ఉక్రెయిన్‌ ఫైటర్ల తరలింపు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ పోర్టు సిటీ మేరియుపోల్‌ ఉక్కుకర్మాగారంలో ఉండి రష్యాను ప్రతిఘటిస్తోన్న సైనికుల్లో 260 మందిని తరలించారు. వీరిని రష్యా ఆధీనంలోని ప్రాంతాలకు తీసుకువెళ్లారు. వీరిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ.. అజోవ్‌స్తల్‌ కర్మాగారం సొరంగాల్లో ఉండి పోరాడి గాయపడిన తమ యోధులను రష్యా నియంత్రిత వేర్పాటు వాద ప్రాంతాలకు తరలించారు. అక్కడ వారికి చికిత్స జరుగుతోంది. ఈ హీరోలు జీవించి ఉండటం ఉక్రెయిన్‌కు చాలా ముఖ్యం. మరికొందరు ఉక్కు కర్మగారంలోనే మరోసారి జరిగే తరలింపు కార్యక్రమం కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చని తెలిపారు. వీరిని కూడా సురక్షితంగా తరలించేందుకు యత్నాలు చేస్తున్నామన్నారు.

రష్యా దళాలు డాన్‌బాస్‌ ప్రాంతంలోని కీలక ప్రాంతాల్లో ఇంకా భారీ ఎత్తున బాంబింగ్‌ చేస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మేరియుపోల్‌లోని అజోవ్‌స్తల్‌లో తీవ్రంగా గాయపడిన 53 మందిని నొవొజోవ్స్క్‌కు, మరో 211 మందిని వొలెన్వికా ప్రాంతాలకు తరలించారు. యుద్ధ ఖైదీల అప్పగింతలో భాగంగా వారు ఇళ్లకు రానున్నారని ఉక్రెయిన్‌ డిప్యూటీ రక్షణ మంత్రి హన్నా మిల్లర్‌ పేర్కొన్నారు. మేరియుపోల్‌ యోధులు వారికి అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేశారన్నారు. అజోవ్‌స్తల్‌లో మరో 1000 మంది వరకు ఉండి ఉండొచ్చని సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పుతిన్‌ ప్రధాన లక్ష్యాల్లో ఒకటైన ‘అజోవ్‌ రెజిమెంట్‌’ కూడా ఈ ఉక్కు కర్మాగారంలోనే ఉంది. ఒకప్పుడు అజోవ్‌ రెజిమెంట్‌ వ్యవస్థాపకుడు ఆండ్రీ బిలెన్స్కీ ఈ కర్మాగారాన్ని తమ దళానికి కోటగా అభివర్ణించాడు.  ఈ కర్మాగారం 11 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. రైలు లైన్లు, గోదాములు, బొగ్గు కొలిమిలు,కర్మాగారాలు, చిమ్నీలు, సొరంగాలతో నిండి ఉంటుంది. ఇందులో దాదాపు 24 కిలోమీటర్లు పొడవైన సొరంగాలు ఉన్నాయి. అర్బన్‌ వార్ఫేర్‌కు అత్యంత అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఉంది. ఉక్రెయిన్‌కు చెందిన 36వ మెరైన్‌ గ్రూప్‌, అజోవ్‌ బ్రిగేడ్‌లు వీటిల్లో దాక్కొని రోజుల తరబడి యుద్ధం చేస్తున్నాయి.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని