Ukraine: జపరోషియా అణువిద్యుత్తు కేంద్రం దెబ్బతింది..!

ఉక్రెయిన్‌కు చెందిన జపరోషియా అణు విద్యుత్తు సైనిక దాడుల్లో కేంద్రం తీవ్రంగా దెబ్బతిందని ఉక్రెయిన్‌ పేర్కొంది. దక్షిణ ఉక్రెయిన్‌లో ఉన్న ఈ ప్లాంట్‌ ఐరోపా ఖండంలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రాల్లో ఒకటి. శుక్రవారం జరిగిన దాడుల్లో ఈ ప్లాంట్‌ తీవ్రంగా దెబ్బతింది.

Published : 07 Aug 2022 14:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ దేశానికి  చెందిన జపరోషియా అణు విద్యుత్తు కేంద్రం.. రష్యా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిందని ఉక్రెయిన్‌ పేర్కొంది. దక్షిణ ఉక్రెయిన్‌లో ఉన్న ఈ ప్లాంట్‌ ఐరోపా ఖండంలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రాల్లో ఒకటి. శుక్రవారం జరిగిన దాడుల్లో ఈ ప్లాంట్‌ తీవ్రంగా దెబ్బతింది. దీనిలోని నైట్రోజన్‌, ఆక్సిజన్‌ ప్లాంట్లు, ఓ సహాయక భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కీవ్‌, మాస్కో పరస్పరం నిందారోపణలు చేసుకొంటున్నాయి. 

ఈ దాడుల్లో ఒక పవర్‌ కేబుల్‌ దెబ్బతినడంతో ఓ రియాక్టర్‌ను మూసివేయాల్సి వచ్చింది. అయినప్పటికీ.. హైడ్రోజన్‌, రేడియోధార్మిక పదార్థాలు లీకయ్యే ముప్పు పొంచి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కాల్పులు జరుగుతుండటంతో ఈ ప్లాంట్‌ను సురక్షితంగా నిర్వహించడం కత్తిమీద సాములా మారింది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టగానే జపరోషియా ప్లాంట్‌ను రష్యా దళాలు ఆక్రమించాయి. ఆ తర్వాత రష్యా దళాలు అక్కడ భారీ ఆయుధాలను భద్రపర్చాయని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను రష్యా కొట్టి పారేస్తోంది. ఉక్రెయిన్‌ దళాలే ప్లాంట్లపై దాడులు చేస్తున్నాయని చెబుతోంది.

మరోవైపు జపరోషియా ప్లాంట్‌ వద్ద రష్యా సైనిక కార్యకలాపాలు చేపట్టడాన్ని ఐరోపా సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని సమాఖ్య దౌత్యవేత్త జోసఫ్‌ బారెల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అణు భద్రతను రష్యా బాధ్యతారాహిత్యంతో ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐఏఈఏ తమ సిబ్బందిని పంపి పరిస్థితిని అంచనావేసేందుకు గత కొన్ని వారాల నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని