Ukraine: క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి.. రష్యా క్రూజ్‌ క్షిపణుల ధ్వంసం

రష్యా ఆధీనంలోని క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడిచేసింది. ఈ దాడిలో రష్యాకు చెందిన కల్బిర్‌ క్షిపణులు ధ్వంసమయ్యాయి.   

Published : 21 Mar 2023 21:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రిమియాపై ఉక్రెయిన్‌ దళాలు దాడి చేసి రష్యాకు చెందిన అత్యాధునిక  కల్బిర్‌ క్రూజ్‌ క్షిపణులను  ధ్వంసం చేశాయి. ఈ క్షిపణులను జాన్‌కోయ్‌ అనే నగరం నుంచి రైలులో రవాణా చేస్తుండగా దాడి చేసినట్లు ఆ దేశ రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని నేరుగా వెల్లడించకపోయినా.. క్రిమియాను నిస్సైనిక ప్రాంతంగా మార్చి ఆ తర్వాత ఆక్రమణదారులను తరిమేయడం కొనసాగుతోందని పేర్కొన్నారు. మరోవైపు క్రిమియాపై దాడిని అక్కడ రష్యా నాయకుడు సెర్గీ అస్కినోవ్‌ కూడా క్రిమియా ద్వీపకల్పంపై దాడి జరిగనట్లు ధ్రువీకరించారు. ఈ దాడిలో ఓ వ్యక్తి గాయపడగా.. రెండు భవనాలు ధ్వంసమయ్యాయని అస్కినోవ్‌ పేర్కొన్నారు.

క్రిమియా ద్వీపకల్పంలో భారీ పేలుడు జరిగిన వీడియో ఒకటి ఆంగ్ల మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. రైల్వే స్టేషన్‌పై ఆ క్షిపణి దాడి జరిగిందని  స్థానికులు వెల్లడిస్తున్నారు. క్రిమియాలో కీలకమైన ఎయిర్‌ ఫీల్డ్‌ల్లో  జాన్‌కోయ్‌, గార్వెడెస్కోయ్‌లు కీలకమైనవి. వీటిల్లో జాన్‌కోయ్‌ కీలక రైల్వే కేంద్రం కూడా. దక్షిణ ఉక్రెయిన్‌ నుంచి ఇక్కడికి కీలకమైన యుద్ధ సామగ్రి సరఫరా అవుతుంది. దీంతోపాటు నల్లసముద్రంలో కీలకమైన నౌకాదళ స్థావరం క్రిమియాలోని సెవస్తోపోల్‌లో  ఉంది.  తాజాగా ఉక్రెయిన్‌ దాడిలో ధ్వంసమైన క్షిపణులు సెవస్తోపోల్‌లోని రష్యా నౌకదళాలకు అందాల్సి ఉంది.

2 బిలియన్‌ డాలర్ల విలువైన మందుగుండు..

ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి భారీగా మందుగుండు సామగ్రి సరఫరా చేయడానికి రంగం సిద్ధంమైంది. వచ్చే ఏడాది కాలంలో కనీసం 10లక్షల శతఘ్ని గుండ్లను సరఫరా చేయడానికి అంగీకరించాయి. రష్యా దూకుడును అడ్డుకోవాలంటే కనీసం నెలకు 3.5లక్షల శతఘ్ని గుండ్లు అవసరం పడుతుందని ఇప్పటికే ఉక్రెయిన్‌ నుంచి ఐరోపా సమాఖ్యకు సమాచారం వెళ్లింది. ఈ నేపథ్యంలో ఐరోపా దేశాల నుంచి 2 బిలియన్‌ డాలర్లు విలువైన మందుగుండు ఉక్రెయిన్‌కు అందనుంది. ఈ నిర్ణయం పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుందని ఉక్రెయిన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి దిమిత్రి కులేబ అభిప్రాయపడ్డారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు