Kharkiv: చిత్రహింసలకు ఛాంబర్లు.. విదేశీ విద్యార్థులపైనా దాష్టీకం!

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం(Ukraine Crisis) మొదట్లో మాస్కో సేనలు కీవ్‌ ముట్టడి యత్నాన్ని విరమించి.. వెనక్కు వెళ్లిన అనంతరం అక్కడ అనేక దారుణాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. కీవ్‌ సమీపంలోని ఇర్పిన్‌, బుచాలో అత్యంత దారుణమైన...

Published : 18 Sep 2022 01:44 IST

ఖర్కివ్‌లో బయటపడుతోన్న రష్యా అకృత్యాలు!

కీవ్‌: ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం(Ukraine Crisis) ప్రారంభంలో పుతిన్‌ సేనలు కీవ్‌ ముట్టడి యత్నాన్ని విరమించి.. వెనక్కు వెళ్లిన అనంతరం అక్కడ అనేక దారుణాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. కీవ్‌ సమీపంలోని ఇర్పిన్‌, బుచాలో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వందలాది మృతదేహాలు బయటపడ్డాయి. మేరియుపోల్‌లోనూ ఇదే దుస్థితి. ఇదంతా రష్యన్‌ సేనల అరాచకమేనంటూ ఉక్రెయిన్‌ ఆరోపించింది. ప్రస్తుతం ఆ దేశంలోని రెండో అతిపెద్ద ప్రాంతమైన ఖర్కీవ్‌(Kharkiv)లోనూ ఇదే తరహా అకృత్యాలు బయటపడుతున్నాయి. ఇటీవలే ఉక్రెయిన్‌ బలగాల ఎదురుదాడితో.. మాస్కో సైనికులు ఈ ప్రాంతాన్ని వీడిన విషయం తెలిసిందే.

రష్యానుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న భూభాగంలో పౌరులపై చిత్రహింసలకు పాల్పడేందుకు ఉద్దేశించిన 10ఛాంబర్లను కనుగొన్నట్లు ఉక్రెయిన్ శుక్రవారం వెల్లడించింది. ఖర్కివ్ ప్రాంతంలో ఇవి బయటపడినట్లు ఉక్రెయిన్ పోలీస్‌ చీఫ్ ఇగోర్ క్లైమెన్కో తెలిపారు. ఇక్కడి ఈశాన్య ప్రాంతంలోని బాలక్లియా పట్టణంలో ఈ తరహా రెండు ఛాంబర్లు కనిపించాయని చెప్పారు. అంతకుముందు.. ఇజియం శివారు అటవీ ప్రాంతంలోని ఓ గొయ్యిలో 440కి పైగా మృతదేహాలు ఉన్నట్లు తూర్పు ఖర్కివ్‌ ప్రాంతంలోని సీనియర్ దర్యాప్తు అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

మృతదేహాలను చూస్తుంటే.. వారిని హింసించి చంపినట్లు కనిపిస్తోందని ఖర్కివ్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అధిపతి ఒలెక్సాండర్ ఫిల్చాకోవ్ తెలిపారు. వారి మృతదేహాలపై చిత్రహింసలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. కొందరి చెవులు కత్తిరించారని, మరికొందరి చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయని పేర్కొన్నారు. పలువురి మెడకు తాడు బిగించినట్లు తెలుస్తోందన్నారు. ఖర్కివ్ ప్రాంతంలోని కుపియాన్స్క్‌లో రష్యా చేతుల్లో చిక్కిన ఆరుగురు శ్రీలంక విద్యార్థుల పట్ల కూడా కర్కశంగా వ్యవహరించినట్లు చెప్పారు. ఆయా ఘటనలపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నామని, వాటిని యుద్ధ నేరాల కింద విచారిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని