Ukraine Crisis: యుద్ధం @ 50రోజులు.. రష్యా నాశనం చేయాల్సింది ఇంకేముంది..?

‘‘చిన్నారులను చంపేశారు. నగరాలను కూల్చేశారు.. మారణహోమాన్ని సృష్టించారు. దోపిడీలకు తెగబడ్డారు. ఉక్రెయిన్‌లో రష్యా చేయాల్సింది ఇంకేం ఉంది?’’.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచాన్ని అడుగుతోన్న ప్రశ్న ఇది.

Published : 15 Apr 2022 13:14 IST

కీవ్‌: ‘‘చిన్నారులను చంపేశారు. నగరాలను కూల్చేశారు.. మారణహోమాన్ని సృష్టించారు. దోపిడీలకు తెగబడ్డారు. ఉక్రెయిన్‌లో రష్యా చేయాల్సింది ఇంకేం ఉంది?’’.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచాన్ని అడుగుతోన్న ప్రశ్న ఇది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై 50 రోజులు అయిన సందర్భంగా జెలెన్‌స్కీ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. శత్రువులకు ఏ మాత్రం వెరవకుండా పోరాటం చేస్తోన్న ఉక్రెయిన్‌ వాసుల ధైర్యాన్ని కొనియాడారు. యుద్ధాన్ని అడ్డుకునే ధైర్యం తమకు ఉందని, అయితే అందుకు అవసరమైన ఆయుధాలు ఇవ్వాలని ప్రపంచ దేశాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.

‘‘ఉక్రెయిన్‌ను లొంగదీసుకునేందుకు 5 రోజులు చాలని దురాక్రమణదారులు భావించారు. కానీ, మా దేశ ప్రజలు తమ జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే పోరాటం. గత 50 రోజులుగా మేం పోరాడుతూనే ఉన్నాం. ఇందుకు చాలా గర్వంగా ఉంది. ఉక్రెయిన్‌ను నాశనం చేయడానికి రష్యా ఎన్ని దురాగతాలకైనా పాల్పడుతోంది. చిన్న పిల్లలను కూడా చంపేస్తున్నారు. నగరాలను సమూలంగా నాశనం చేస్తున్నారు. దొరికింది దొరికినట్లు దోచుకుంటున్నారు. మా దేశంలో రష్యా చేయాల్సిన దారుణాలు ఇంకేం ఉన్నాయి. అయినా మేం వేటికీ భయపడం. ఎందుకంటే, మేం దేనికోసం పోరాడుతున్నామో మాకు స్పష్టంగా తెలుసు. మీరు(ప్రపంచ దేశాలను ఉద్దేశిస్తూ) మాతో కలిసి పోరాడాల్సిన అవసరం లేదు. యుద్ధాన్ని ముగించడానికి కావాల్సినంత ధైర్యం మాలో ఉంది. కానీ, రష్యా మిలిటరీకి మాత్రం అండగా ఉండొద్దు. ఈ పోరాటంలో మాకు కావాల్సిన ఆయుధ సాయం అందించండి చాలు. ఉక్రెయిన్‌కు అండగా నిలవండి’’ అంటూ జెలెన్‌స్కీ కోరారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. తొలుత ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన మాస్కో.. ఆ తర్వాత సాధారణ జనావాసాలపైనా విరుచుకుపడింది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చడమే గాక, వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మేరియుపొల్‌లో ఇప్పటివరకు 10వేల మంది మరణించినట్లు సమాచారం.

మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్‌ సేనలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. శత్రువులు అధీనంలోకి తీసుకున్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా విడిపించుకుంటున్నాయి. నిన్న నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌ జరిపిన క్షిపణి దాడిలో రష్యాకు చెందిన భారీ యుద్ధ నౌక మాస్క్‌వా ఒకటి తీవ్రంగా ధ్వంసమై నీట మునిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని