Ukraine war: ‘మూడో ప్రపంచ యుద్ధానికి ఇదే నాంది కావొచ్చు’

ఉక్రెయిన్‌పై రష్యా దాడి మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావొచ్చని అని బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు...

Updated : 25 May 2022 11:22 IST

ప్రముఖ బిలియనీర్‌ జార్జ్ సోరోస్‌ హెచ్చరిక

దావోస్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడి (Ukraine-Russia War) మూడో ప్రపంచ యుద్ధానికి (Third World war) నాంది కావొచ్చని బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం వల్ల మానవాళి మనుగడకే ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin) బంధానికి అవధులు లేవని వ్యాఖ్యానించారు. దావోస్‌ (Davos)లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి యావత్‌ ప్రపంచం కలిసి రావాలని సోరోస్‌ పిలుపునిచ్చారు. మానవాళిని, నాగరికతను పరిరక్షించుకోవాలంటే పుతిన్‌ (Putin)ను ఓడించడమొక్కటే మార్గమని వ్యాఖ్యానించారు. ఈ యుద్ధం ఆకస్మాత్తుగా వచ్చింది కాదని.. దీనికి సంబంధించిన సమాచారం పుతిన్‌ చాలా కాలం క్రితమే జిన్‌పింగ్‌ (Xi Jinping)కు తెలియజేశారని చెప్పుకొచ్చారు. శీతాకాల ఒలింపిక్స్‌ సందర్భంగా ఇరువురు భేటీ అయి ఫిబ్రవరి 4న వారి బంధానికి సంబంధించి సుదీర్ఘ ప్రకటన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సోరోస్‌ గుర్తుచేశారు. అప్పుడే ఉక్రెయిన్‌లో సైనిక చర్యకు సంబంధించిన సమాచారాన్ని జిన్‌పింగ్‌కు పుతిన్‌ తెలియజేశారని తెలిపారు. అయితే, శీతాకాల ఒలింపిక్స్‌ ముగిసే వరకు వేచి చూడాలని జిన్‌పింగ్‌ కోరినట్లు పేర్కొన్నారు.

జిన్‌పింగ్‌ కొవిడ్‌ను ఎదుర్కొన్న తీరుపైనా సోరోస్‌ తీవ్ర విమర్శలు చేశారు. వుహాన్‌ వేరియంట్‌ కోసం తయారు చేసిన టీకాలను చైనా ప్రజలకు ఇచ్చి మోసం చేశారని వ్యాఖ్యానించారు. అవి ఇతర వేరియంట్లపై ఏమాత్రం పనిచేయబోవని తెలిసి కూడా ఆయన ఈ చర్యకు సిద్ధపడ్డారని ఆరోపించారు.

మరోవైపు ఉక్రెయిన్‌లో సైనిక చర్య పుతిన్‌ ఊహించినట్లుగా సాగడం లేదని సోరోస్‌ తెలిపారు. ఉక్రెయిన్‌లో రష్యన్‌ భాష మాట్లాడేవారు తమ సైన్యానికి ఘన స్వాగతం పలుకుతారని పుతిన్‌ భావించారన్నారు. అలాగే రష్యన్‌ సైనికులు విజయ కవాతు కోసం మిలిటరీ డ్రెస్సులను కూడా తీసుకొని వెళ్లారన్నారు. కానీ, పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. మరోవైపు పుతిన్‌, జిన్‌పింగ్‌ మధ్య అనేక సారూప్యతలున్నాయన్నారు.

ఉక్రెయిన్‌పై దాడి చేసి తప్పు చేశానని పుతిన్‌కు ఇప్పటికే అర్థమై ఉంటుందని సోరోస్‌ అభిప్రాయపడ్డారు. అందుకే ఆయన కాల్పుల విరమణ ఒప్పందం కోసం వేదికను సిద్ధం చేసుకుంటున్నారన్నారు. అయితే, శాంతి చర్చలు పుతిన్‌ నుంచే ప్రారంభం కావాల్సి ఉంటుందన్నారు. కానీ, అది ఎప్పటికీ సాధ్యం కాదని.. ఎందుకంటే అది ఆయన రాజీనామా చేయడంతో సమానమవుతుందని విశ్లేషించారు. అలాగే చైనాలోనూ జిన్‌పింగ్‌ ప్రాబల్యం తగ్గుతోందని తెలిపారు. జీవితకాల అధ్యక్షుడిగా ఆయన కొనసాగే అవకాశాలు లేవన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని