Ukraine: ఉక్రెయిన్‌పై భారీ దాడి.. నోవా కఖోవ్కా డ్యామ్‌ పేల్చివేత..!

ఉక్రెయిన్‌ గుండెబద్దలైంది. ఆ దేశంలో అత్యంత కీలకమైన  నోవా కఖోవ్కా ఆనకట్టను పేల్చివేశారు. ఇది రష్యాపనే అని ఉక్రెయిన్‌ అంటుండగా.. మాస్కో మాత్రం దీనిని ఉగ్రదాడితో పోల్చింది. లోతట్టు ప్రాంతాలవైపు భారీ వరద దూసుకెళుతుండటంతో స్థానిక ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

Updated : 06 Jun 2023 11:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ భయపడినంతా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున నీపర్‌ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ను పేల్చివేయడంతో.. నీటి వరద ముంచుకురావడం మొదలైంది. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్‌కు 30 కిమీ దూరంలోని ఈ డ్యామ్‌ వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. గత కొన్ని నెలలుగా ఈ డ్యామ్‌ సమీపంలో భారీగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ ఉక్రెయిన్‌ మిలటరీ కమాండ్‌ ఈ ఘటనపై స్పందిస్తూ రష్యా దళాలే దీనిని పేల్చివేశాయని ఆరోపించింది. మరో వైపు ఆక్రమిత ఉక్రెయిన్‌లోని రష్యా అధికారులు మాత్రం ఇది ఉగ్రదాడి అని చెబుతున్నట్లు టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. దీనిపై స్థానిక రష్యా మేయర్‌ వ్లాదిమిర్‌ లియోనేటివ్‌ మాట్లాడుతూ ‘‘అర్ధరాత్రి రెండు గంటల నుంచి కఖోవ్కా డ్యామ్‌పై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకు గేటు వాల్వులు దెబ్బతిన్నాయి. ఫలితంగా నీటి లీకులు మొదలయ్యాయి. కొద్దిసేపటికే నియత్రించలేని విధంగా నీరు కిందకు ప్రవహించడం మొదలైంది’’ అని వెల్లడించారు. ఖెర్సాన్‌లో లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. ఐదున్నర గంటల్లో వరద అక్కడకు చేరుతుందని అంచనావేస్తున్నారు.

ఈ డ్యామ్‌ పేల్చివేతతో స్థానికంగా ఉన్న ప్రజలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వేల మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని రష్యా అధికారిక మీడియా పేర్కొంది. మరోవైపు నీపర్‌ నదికి తూర్పు తీరాన ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని ఉక్రెయిన్‌ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, అత్యవసరమైన పత్రాలు, నిత్యావసరాలు తీసుకొని ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. మైఖోలావిక, ఓల్హిక, లివొ, టియాంగికా, పోనియాటివ్కా, ఇవానివ్కా, టోకరివ్కా వంటి గ్రామాలను ఖాళీ చేయాలని సూచించారు. డ్యామ్‌ పేల్చివేతను ఉక్రెయిన్‌ అధికారులు పర్యావరణ విధ్వంసంగా అభివర్ణించారు. డ్యామ్‌ విధ్వంసంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. దీనిలో నేషనల్‌ సెక్యూరిటీ, డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యలు పాల్గొననున్నారు.

ఈ డ్యామ్‌ 30 మీటర్ల ఎత్తు.. కొన్ని వందల మీటర్ల పొడవు ఉంది. 1956లో కఖోవ్కా జలవిద్యుత్తు కేంద్రంలో భాగంగా నిర్మించారు. ఈ రిజర్వాయర్‌లో  18 క్యూబిక్‌ కిలోమీటర్ల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది. ఇది గ్రేట్‌ సాల్ట్‌ లేక్‌లోని నీటికి సమానం. ఈ డ్యామ్‌ వరద ఖేర్సాన్‌ వైపు ప్రవహించి నష్టం సృష్టించగలదు. గతేడాది అక్టోబర్‌లో ఈ డ్యామ్‌ను ఉక్రెయిన్‌ దళాలు తిరిగి స్వాధీనం చేసుకొన్నాయి. నాటి నుంచి ఆనకట్టను పేల్చివేస్తారనే భయాలు నెలకొన్నాయి. తాజాగా ఈ డ్యామ్‌ పేల్చివేతతో ఉక్రెయిన్‌ కరెంటు కష్టాలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఆ దేశానికి అణువిద్యుత్తును ఇచ్చే జపొరిజియా రష్యా స్వాధీనంలో వెళ్లిపోయింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని